
మార్చి మొదటివారంలో ఎంపిక:
చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ఇటీవలే ముగియడంతో.. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు బీసీసీఐ బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇక కొత్త సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యతను మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీకి అప్పగించింది. అయితే కొత్త సెలక్టర్ల ఎంపికకు నిర్దిష్టమైన సమయం ఏదీ లేకపోయినా.. వచ్చే నెల మొదటివారం (మార్చి 1, 2)లోనే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మదన్‌లాల్ తెలిపారు.

రేసులో నలుగురు:
సీఏసీ సభ్యులు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం, ఇంటర్వ్యూల ప్రక్రియను పూర్తి చేసారు. ఇక చివరి దశ ఇంటర్వ్యూలకు మాత్రం నలుగురు మిగిలారు. మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్, మరో మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్లు రేసులో ఉన్నారు. అయితే చీఫ్ సెలక్టర్ రేసులో లక్ష్మణ్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్ మధ్యే తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.

అగార్కర్‌కే అవకాశం:
అత్యంత అనుభవజ్ఞుడినే చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేస్తామన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అజిత్ అగార్కర్‌నే పదవి వరించే అవకాశం ఉంది. అగార్కర్ 26 టెస్టులు ఆడగా.. శివరామ కృష్ణన్ 9 టెస్టులు మాత్రమే ఆడారు. ఒకవేళ అగార్కర్‌ను తీసుకుంటే.. వెస్ట్ జోన్ నుంచి ఇద్దరికి ప్యానెల్లో చోటు లభించినట్టవుతుంది. జతిన్ పరాంజపే ఇప్పటికే ప్యానెల్లో ఉన్న విషయం తెలిసిందే.

ప్రాంతాల సమస్య:
ఇక్కడ ప్రాంతాల వారీగానూ సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే జతిన్ పరాంజపె వెస్ట్‌జోన్ నుంచి ఉన్నారు. ముంబైకి చెందిన అగార్కర్ ఎంపికైతే వెస్ట్‌జోన్ నుంచి కమిటీలో ఇద్దరు ఉంటారు. అతిపెద్ద దేశంలో ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకుంటామని బీసీసీఐ చెబుతోంది. ఈ ప్రకారంగా.. అగార్కర్‌కు అవకాశం లేనట్టే? అన్న సందేహం తలెత్తుతోంది. మొత్తానికి ఈ ఎంపిక అనుకున్నంత సులభంగా సాగేలా కనిపించడం లేదు.