మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అయిదు ఫ్రాంచైజీల తరఫున ప్రాతినిథ్యం వహించిన గౌతమ్.. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ అత్యంత చెత్తదిగా పేర్కొన్నాడు. పంజాబ్ ఫ్రాంచైజీకి వెళ్లొద్దనుకుంటున్నాని, ఒకవేళ వెళ్లినా వంద శాతంతో ప్రదర్శన చేయాలని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
36 ఏళ్ల కృష్ణప్ప గౌతమ్ 2018లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గత ఆరు సీజన్లలో అయిదు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. రాజస్థాన్‌తో పాటు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 2021 సీజన్ వేలంలో గౌతమ్ కోసం సీఎస్కే రూ.9.25 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్లలో అత్యధిక ధర సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. 2022 సీజన్‌లో అతన్ని లక్నో దక్కించుకుంది. మెగా వేలం ముంగిట గౌతమ్‌ను లక్నో ఫ్రాంచైజీ విడుదల చేసింది.

'ఐపీఎల్‌లో మీరు ఆడకూడదనే జట్టు ఏమైనా ఉందా?' అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. గౌతమ్ వివాదస్పదంగా సమాధానమిచ్చాడు. ''నిజాయతీగా చెప్పాలంటే పంజాబ్ కింగ్స్ అని సమాధానమిస్తాను. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో నాకు గొప్ప అనుభవం లేదు. అలా అనీ క్రికెట్‌కు సంబంధి మాత్రమే విషయాన్ని చెప్పట్లేదు. ఇతర విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని చెబుతున్నాను. ఓ క్రికెటర్‌కు ఇచ్చే గౌరవం లేదని నేను భావించాను. బరిలోకి దిగిన తర్వాత ఏ జట్టుకు అయినా వంద శాతం లేదా అంత కంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈ జట్టుకు మాత్రం అలా చేయలేను'' అని కృష్ణప్ప గౌతమ్ అన్నాడు.
కాగా, నేటి నుంచి మొదలుకానున్న ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ భారీ మొత్తంతో బరిలోకి దిగింది. పంజాబ్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 41 కోట్లు ఉన్నాయి. ఇక సీఎస్కే- రూ.55 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 73 కోట్లు, కేకేఆర్- రూ. 51 కోట్లు, ఆర్సీబీ- రూ. 53 కోట్లు, లక్నో- రూ. 69 కోట్లు, ముంబై ఇండియన్స్- రూ.45 కోట్లు, ఎస్‌ఆర్‌హెచ్- రూ.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్- రూ. 69 కోట్లు ఉన్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నేడు, రేపు మెగా ఆక్షన్ జరగనున్న విషయం తెలిసిందే. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.