ఆసియాకప్ సీన్స్ రిపీట్
ఆసియా కప్‌లో ఆఖరి ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చి విమర్శల పాలైన భువీ.. మరోసారి అదే సీన్ ఈ మ్యాచ్‌లోనూ రిపీట్ చేశాడు. తన స్పెల్‌లో 4ఓవర్లలో ఏకంగా 52పరుగులు సమర్పించుకున్నాడు. అతనిక జతగా మిగతా బౌలర్లు చాహల్ 3.2ఓవర్లలో 42, హర్షల్ పటేల్ 4ఓవర్లలో 49పరుగులు సమర్పించుకుని భారత పరాజయానికి కారకులయ్యారు. భారత బౌలర్లు డెత్ ఓవర్లయిన 17, 18, 19ఓవర్లలో 15, 22, 16 పరుగులు వరుసగా సమర్పించుకున్నారు. ఈ మూడు ఓవర్లలో ఏ ఒక్క ఓవర్ కట్టడి అయినా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదేమో.
ఆ ఓవరే టర్నింగ్ పాయింట్
హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ ఓవర్‌లోనే వేడ్ ఇచ్చిన కాట్ అండ్ బాల్ క్యాచ్‌ను హర్షల్ మిస్ చేయడం వేడ్‌కు మరింత ఊపునిచ్చింది. చితక్కొట్టుడు కొడితే.. ఆ ఓవర్లలో మూడు సిక్సులతో సహా 22పరుగులొచ్చాయి. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తప్ప మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. అక్షర్ పటేల్ 4ఓవర్లలో 17పరుగులే ఇచ్చి 3వికెట్లు తీశాడు. ఇక అక్షర్ కూడా గేట్లేత్తేసి ఉంటే.. ఆసీస్ బ్యాటర్లు 16ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేవారు.
భువీకి 19వ ఓవర్ ఇస్తే మ్యాచ్ హుష్ కాకి
ఇకపోతే భువీ ఆసియాకప్‌లో సూపర్ 4దశలో రెండు మ్యాచ్‌లలో కీలక 19వ ఓవర్లో ధారాళంగా పరుగులిచ్చి మ్యాచ్ చేజారేలా చేశాడు. భారత అగ్ర పేసర్ గా చెలామణీ అవుతున్న భువీ.. పాకిస్థాన్ మ్యాచ్‌లో 19వ ఓవర్లో 19పరుగులిచ్చాడు. శ్రీలంకపై 17పరుగులిచ్చాడు. తాజాగా ఆసీస్‌పై 16పరుగులిచ్చాడు. ఇక భువీకి 19వ ఓవర్ ఇస్తే మ్యాచ్ హుష్ కాకే అనేలా అతని బౌలింగ్ సాగుతోంది. వైడ్లు వేయడం.. ఒకట్రెండు బాల్స్ డిఫెండ్ చేసి మిగతా బాల్స్ బౌండరీలు ఇవ్వడం భువీకి అలవాటైపోయింది.
దీంతో చివరి ఓవర్లో ఎంత తోపు బౌలర్ అయినా ఏం చేయలేని పరిస్థితికి తీసుకొస్తున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో భువీ 8పరుగుల లోపు లేదా ఎట్ లిస్ట్ 10పరుగుల లోపు పరుగులు ఇచ్చుంటే.. మూడింట్లో కనీసం రెండైనా గెలిచి ఉండేది.
రోహిత్ శర్మ పైశాచికత్వం తగ్గించుకుంటే మంచిది
ఇక రోహిత్ శర్మ పైశాచికత్వం పట్ల కూడా నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. భువీకి 19వ ఓవర్ పడట్లేదు అని తెలిసి కూడా అతన్నే ఏరికోరి మరి వేయిస్తున్నాడు. భువీ పవర్ ప్లే బౌలర్ అంటూ మాజీ విశ్లేషకులు మొత్తుకుంటున్నా రోహిత్ మాత్రం తానో మోనర్క్ తననెవరూ మార్చలేరనేలా భువీకి బౌలింగ్ ఇస్తూ గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడేలా చేస్తున్నాడు. భువీని పవర్ ప్లే, మిడిల్ ఓవర్లో వాడుకుంటే కొంత బెటర్ వికెట్ టేకింగ్ ఆప్షన్లు ఉంటాయని సగటు అభిమానికి అర్థమవుతున్నా.. డెత్ ఓవర్లలో భువీని పదేపదే బౌలింగ్ చేయిస్తూ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు.
విరాట్ కోహ్లీ రస్టీ లుక్‌తో ట్రోల్
ఇక భువీ 19వ ఓవర్ బౌలింగ్ దిగుతుంటే చాలు భారత అభిమానులు టీవీ కట్టేసి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. భువీకి 19వ ఓవర్ పదేపదే ఇవ్వడం పట్ల నెటిజన్లు చాలా సీరియస్ అవుతున్నారు. మీకో దండం రా నాయనా అంటూ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు. భువీ బౌలింగ్ చేస్తే చేయని గానీ.. 19వ ఓవర్ మాత్రం ఇవ్వకండ్రా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ నిన్నటి మ్యాచ్‌లో ఓ రస్టీ లుక్ ఇచ్చాడు. దాన్ని ఓ నెటిజన్ పోస్టు చేస్తూ.. ఎప్పుడూ 19వ ఓవర్ భువీకి ఇచ్చినా భారత అభిమానుల లుక్ ఇలాగే ఉంటుందనేలా ఓ పోస్ట్ చేశాడు.
టీంను సర్వనాశనం చేసే ప్రయోగాలు
ఓ మూవీలో రజినీకాంత్ కట్టుబట్టలతో బయటికెళ్లే సీన్లో దండం పెడుతుంటాడు. దాన్ని పోస్టు చేస్తూ ట్వీట్ చేశాడు. ఇంకొందరు భువీ బౌలింగ్, అర్షదీప్ బౌలింగ్ కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు బాయ్‌కాట్ 19వ ఓవర్ టు భువీ అని ట్వీట్ చేస్తున్నారు. ఇంకొందరు టీంను సర్వనాశనం చేసే ప్రయోగాలు చేస్తున్నారంటూ కొందరు ద్రావిడ్, రోహిత్‌ను ఏసుకుంటున్నారు. ఏదేమైనా భువీ డెత్ బౌలింగ్ ఆప్షన్ కాదని టీమిండియా గుర్తుంచుకుంటే మంచిది.


Click it and Unblock the Notifications












