
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ధోని అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు కారణం క్రిస్మస్ సందర్భంగా అతడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో. ఈ ఫోటోలో మాలిక్ భారత పట్ల తన దుర్బుద్దిని మరోసారి ప్రదర్శించాడు.
క్రిస్మస్ సందర్భంగా సోషల్ మీడియాలో 'మేరీ క్రిస్మస్ దోస్తోం.. వెరీ హ్యాపీ డిసెంబర్ 25' అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఫోటోలో మాలిక్ విజయం సాధించిన సంతోషంలో ఉండగా... మరోవైపు నిరాశగా వెనుదిరుగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు.
ఇదే భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్ మీడియాలో మాలిక్‌ను భారత అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు. 2012, డిసెంబర్ 25న భారత్-పాక్‌ల మధ్య జరిగిన తొలి టీ20లో పాక్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మాలిక్ ఆర్ధసెంచరీతో రాణించి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తాజాగా ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసి పైవిధంగా కిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో షోయబ్ మాలిక్ డకౌటైన ఫోటోతో పాటు రోహిత్ కాళ్ల ముందు మాలిక్ పడిపోయిన ఫోటోలను రీట్వీట్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.