
జులై 29న ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్ కోసం 18మంది సభ్యులతో కూడిన ఇండియా టీంను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఈ జట్టులో భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. ఇది భారత అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో చాహల్ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత్ ఆడుతున్న ప్రతి టీ20 సిరీస్‌కు చాహల్ ఎంపికయ్యాడు. అతను దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20ల్లో 4ఇన్నింగ్స్‌లలో 14.1 స్ట్రైక్ రేట్, 8.18ఎకానమీ రేట్, 19.33 సగటుతో 6 వికెట్లు తీశాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో రెండు టీ20లు ఆడిన అతను సగటున 10.50, ఎకానమీ రేటు 7.00తో స్ట్రైక్ రేట్ 9.0తో 4వికెట్లు తీశాడు. ఇక 2022లో టీమిండియా తరపున అతను 12టీ20లు ఆడాడు. 18.13 సగటుతో, 7.12 ఎకానమీ రేటుతో 15.2 స్ట్రైక్ రేట్‌తో 15 వికెట్లు తీశాడు.
ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో అతను అద్భుత ప్రదర్శన చేశాడనే చెప్పాలి. కానీ బీసీసీఐ అతన్ని ఎందుకు పక్కన పెట్టిందో అర్థం కాలేదు. బీసీసీఐ అతనికి రెస్ట్ ఇవ్వాలనుకుందా లేకుంటే కావాలనే తీసేసిందా అనేది అర్థం కావడం లేదు. టీ20ప్రపంచకప్ ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. అయితే చాలా మంది చాహల్‌కు విశ్రాంతి కల్పించాలనే బీసీసీఐ అతన్ని తప్పించి ఉండొచ్చు అని పేర్కొంటున్నారు.
ఎందుకంటే వరుసగా సిరీస్లు ఆడుతున్నందున ఓ సిరీస్‌కు అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ భావించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు జట్టులోకి స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ ఎంపికయ్యారు. ఇక రవీంద్రా జడేజా, అక్షర్ పటేల్ ఆల్రౌండర్ల లిస్టులో ఎంపిక కాగా.. బిష్ణోయ్, అక్షర్ పటేల్, కుల్దీప్ స్పెషలిస్టు స్పిన్నర్లుగా ఎంపికయ్యారు. ఇకపోతే ఈ సిరీస్లో అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ ఎంపిక కాగా స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ మిస్సయ్యాడు.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్