బెంగళూరు: సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఐపిఎల్ 9 ఎడిషన్ ఫైనల్ మ్యాచులో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ నుంచి జట్టును విజయవంతంగా ముందుకు నడిపించిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను నెటిజన్లు బాహుబలితో పోలుస్తున్నారు.
బాహులి ప్లేస్‌లో వార్నర్ ఫొటోను మార్ఫింగ్ చేసి తమ అభిమానాన్ని ప్రదర్శించుకుంటున్నారు. ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం జట్టు సమిష్టి కృషి వల్లనే సాధ్యమైందని వార్నర్ చెబుతున్నప్పటికీ నెటిజన్లు మాత్రం ఆయనొక్కడికే ఆపాదిస్తున్నారు.
హైద్రాబాద్ సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ బెన్ కటింగ్ చివరి ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాడు. 15 బంతుల్లో 39 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరుస సిక్స్‌లు, ఫోర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది.

అయితే క్రికెట్‌ను ఎంతగానే అభిమానించే టాలీవుడ్ హీరో వెంకటేష్ ఈ మ్యాచ్‌ను తిలకించాడదు. కటింగ్ కొట్టిన ఓ సిక్స్ 117 మీటర్ల ఎత్తులో వెళ్లింది. ఈ సిక్స్‌కు వెంకటేష్ గ్యాలరీ నుంచి లేచి అరుస్తూ సన్‌రైజర్స్ జెండాను రెపరెపలాడిస్తూ ఉత్సాహంతో పెద్దగా కేకలు వేశారు.
కోహ్లీని ఆకాశానికెత్తిన వార్నర్
ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందిన తర్వాత బహుమతి ప్రధానోత్సవంలో మాట్లాడిన వార్నర్ కోహ్లీని తన ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడని, తన జట్టును అతను ముందుండి నడిపించిన తీరు అమోఘమని అన్నాడు. అతను ఓ గొప్ప నాయకుడని, భారత భవిష్యత్ క్రికెట్ కొందరు గొప్ప ఆటగాళ్ల చేతుల్లో ఉందని చెప్పాడు.

ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని చాలామంది ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా నిలచాడని, బ్యాటింగ్‌లో ఒక బెంచ్ మార్క్‌ను నెలకొల్పాడని వివరించాడు. ఈ టోర్నీలో కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు. 973 పరుగులు చేసిన కోహ్లీ ఐపిఎల్‌లోనే కాదు సింగిల్ టీ20 టోర్నమెంట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే కోహ్లీ తర్వాత 848 పరుగులతో డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు.

గేల్‌ను లేపిన వార్నర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గేల్‌తో ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్ వేయించాడు. అయితే గేల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గేల్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ షాట్ కొట్టగా దాన్ని ఆపే ప్రయత్నంలో గేల్ కింద పడ్డాడు. దీంతో పక్కనే ఉన్న డేవిడ్ వార్నర్ గేల్‌ను రెండు చేతులతో పైకి ఎత్తాడు. వెంటనే ఇరువురి ఆటగాళ్ల ముఖాల్లో ఉల్లాసం వెల్లివిరిసింది.