Pakistan vs Netherlands: పసికూన దెబ్బకు పాకిస్థాన్ ప్లేయర్లకు కారిపోయాయి..! గట్టెక్కించిన నషీమ్ షా

నెదర్లాండ్స్ జట్టు పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టించింది. దాదాపు గెలిచినంత పని చేసింది. అయితే చివర్లో వికెట్లు కోల్పోయిన డచ్ టీం గెలుపు అంచుల్లో బోల్తా పడింది. రోటర్‌డామ్‌లోని హజెలార్‌డామ్‌లో జరిగిన మూడోది మరియు చివరిదైన వన్డే మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. నెదర్లాండ్స్ దెబ్బకు పాకిస్థాన్ ప్లేయర్లకు చెమటలు కారిపోయాయి. పాకిస్థాన్ యువ బౌలర్ నషీమ్ షా (10ఓవర్లలో 33పరుగులు) 5వికెట్ల హాల్ సాధించి పాక్‌ను చివర్లో గట్టెక్కించాడు. తద్వారా పాకిస్థాన్ 9పరుగుల తేడాతో గెలుపొందింది. అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో సిరీస్‌ను 3-0తో పాకిస్థాన్ కైవసం చేసుకుంది. ఏదేమైనప్పటికీ పాకిస్థాన్‌కు ఈ సిరీస్ విజయం అంత సులువుగా ఏం రాలేదు. పసికూన లాంటి నెదర్లాండ్స్ టీం అసామాన్య పోరాటాన్ని కనబర్చింది. తొలి మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. తొలి మ్యాచ్ 16పరుగుల తేడాతో ఓడిపోగా.. మూడో మ్యాచ్‌లో కేవలం 9పరుగుల తేడాతో ఓడిపోయింది. పాక్ లాంటి టీంపై ఇలాంటి ప్రదర్శన చేయడంతో నెదర్లాండ్స్ జట్టు పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.
షాహీన్ అఫ్రిది లేకుంటే ఉత్తదే
ఈ సిరీస్లో పాకిస్థాన్ జట్టు స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది లేని లోటు స్పష్టంగా కన్పించింది. పాక్ బౌలింగ్ దళం ఎక్కువగా షాహీన్ అఫ్రిదిపై ఆధారపడుతుందనే విషయం స్పష్టమైంది. ఈ సిరీస్‌లో అఫ్రిదికి విశ్రాంతి ఇచ్చి ఇతర పేసర్లను ప్రయోగిస్తే వాళ్లు అనుకున్నంత రాణించలేదు. ఏదో చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందాన పాక్ గెలిచిందే గానీ.. నెదర్లాండ్స్ లాంటి జట్టుపై ఇలా గెలవడం వల్ల పాక్ గెలిచినా పెద్ద ప్రయోజనం ఏం ఉండదు.
సెంచరీ మిస్ అయిన బాబర్ ఆజామ్
ఇక మూడో వన్డే విషయానికొస్తే.. కెప్టెన్ బాబర్ ఆజామ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాప్-ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేసినా.. బాబర్ ఆజామ్ ఒంటిగా పోరాడాడు. అతను స్కోర్‌బోర్డ్‌ను 200 దాటించడానికి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 125 బంతుల్లో 91పరుగులు చేసిన బాబర్ తన గేర్ మార్చి హిట్టింగ్ చేద్దామనే టైంలో 43వ ఓవర్లో ఆర్యన్ దత్ పట్టిన అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు. అతను తద్వారా తన 18వ వన్డే సెంచరీని కోల్పోయాడు. మిగిలిన బ్యాటర్లు అంతంతమాత్రంగానే ఆడడంతో పాకిస్థాన్ జట్టు 49.4ఓవర్లలో కేవలం 206పరుగులకు పరిమితమైంది.
విక్రమ్ జిత్ సింగ్, టామ్ కూపర్ అసామాన్య పోరాటం
ఇక ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ టీం.. 14ఓవర్లు ముగిసేసరికి 37/3తో చాలా కష్టాల్లో పడింది. ఈ టైంలో ఆ జట్టు ఓపెనర్, మన భారత సంతతి ప్లేయర్ విక్రమ్‌జిత్ సింగ్ (50), టామ్ కూపర్ కలిసి నాలుగో వికెట్‌కు 71పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ తర్వాత విక్రమ్ జిత్ ఔటయినా.. కూపర్ మాత్రం తన ఒంటరి పోరాటం కొనసాగించాడు. అతను అత్యంత జాగ్రత్తగా ఆడుతూ స్కోరును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో (105 బంతుల్లో 62 పరుగులు) 46వ ఓవర్‌లో దురదృష్టవశాత్తూ ఔటయ్యాడు. అతను చివరి వరకు ఉండుంటే నెదర్లాండ్స్ గెలిచేదే కానీ.. అది జరగలేదు. చివరి ఓవర్‌లో 14పరుగులు కావాల్సిన దశలో కేవలం 4పరుగులు చేసి చివరి వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 197పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 9పరుగుల తేడాతో పాక్ గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications