హైదరాబాద్: ట్రిపుల్ సెంచరీ అనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. జీవితంలో ఒక్కసారైనా ఆ నెంబర్‌ను అందుకోవాలని ఆలోచిస్తుంటారు. క్రికెట్‌లో ఏ స్థాయిలోనైనా మూడొందలు పరుగులు చేసినా అది రికార్డే. అలాంటిది ఒకే టోర్నీలో పదిహేను రోజుల వ్యవధిలోనే రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు నెల్లూరుకి చెందిన కల్లూరి రేవంత్ రెడ్డి అనే యువ క్రికెటర్.
ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అండర్-14 రెండు రోజుల టోర్నమెంట్‌లో రేవంత్ రెండు ట్రిపుల్ సెంచరీలు చేసి క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ఏసీఏ చరిత్రలో ఏ వయసు విభాగంలోనైనా ఒక టోర్నీలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

సెప్టెంబర్ 23న విజయనగరం జట్టుపై తొలిసారిగా రేవంత్ (304 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేశాడు. తాజాగా పశ్చిమగోదావరితో గురువారం మొదలైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రేవంత్ 289 బంతుల్లో 53 ఫోర్ల సాయంతో 301 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
దీంతో నెల్లూరు జట్టు 75 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. అనంతరం ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పశ్చిమగోదావరి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.