
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టీమిండియా ఇప్పటికే బయల్దేరి అక్కడికి చేరకుంది. జట్టులోని ఆటగాళ్ల గురించి ఒకొక్కరు తోచిన విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో టీమిండియా మాజీ ఆటగాడైన ఆశిష్ నెహ్రా కూడా చేరిపోయాడు.
జనవరి 5న జరిగే భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో జరిగే తొలి టెస్టులో యువ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఆడించాలని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నారు.
'టీమ్ మేనేజ్‌మెంట్ మదిలో ఏముందో నాకైతే తెలీదు. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వికెట్ బుమ్రాకు సరిగ్గా సరిపోతుంది. రంజీల్లో ఆడిన బుమ్రా గుజరాత్ తరఫున అద్భుతమైన యార్కర్‌లతో చెలరేగాడు. అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా సుదీర్ఘమైన స్పెల్స్ వేయగలడు. ఇవన్నీ సఫారీ గడ్డపై అతనికి కలిసొస్తాయి' అని నెహ్రా అభిప్రాయపడ్డారు.
జనవరిలో కేప్‌టౌన్ వాతావరణం ఎండవేడిమితో ఉంటుందని, సీమర్లకు ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే షమీ, ఇషాంత్‌ల తర్వాతే మూడో సీమర్ ఎవరనే చర్చ ఉంటుందని చెప్పారు. ఇషాంత్ తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను అదేపనిగా అసహనానికి గురి చేస్తాడని, దీనివల్ల మరో ఎండ్‌లో బౌలర్‌కు దొరికిపోయే అవకాశాలున్నాయన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.