హైదరాబాద్: విదేశాల్లో కూడా విజయాలను సాధిస్తేనే టీమిండియా ప్రపంచంలో అత్యుత్తమ వన్డే జట్టుగా ఎదుగుతుందని విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రస్తుత టీమిండియానే తాను చూసిన మేటి భారత జట్టు అని ఇటీవల దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.
'మాకు గావస్కర్ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. కొన్నేళ్ల పాటు టీమిండియాకు ఆడిన వ్యక్తి మమ్మల్ని అభినందించడం బాగా అనిపిస్తోంది. ఇది జట్టులో కొత్త శక్తిని నింపుతుంది. ఈ యువ జట్టు ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. కానీ ఒక గొప్ప జట్టు అనిపించుకునే స్థాయి ఇంకా చాలా దూరం ఉందనుకుంటున్నా' అని కోహ్లీ అన్నాడు.

'ఎందుకంటే మా జట్టు ఇంకా యువ క్రికెట్ జట్టే. మేము స్వదేశంలో చాలా బాగా ఆడుతున్నాం. మనకు అనుకూలించని విదేశీ పిచ్‌లపై విజయ పరంపర కొనసాగిస్తే హాయిగా కూర్చొని చాలా సాధించామని సంబరపడొచ్చు. అప్పుడే మేము మేటి జట్టుగా నిలుస్తాం. ఇప్పటివరకూ జట్టుగా ఏమి సాధించామో అందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది' అని కోహ్లీ పేర్కొన్నాడు.
'ఇప్పుడే ఆసీస్‌పై సిరీస్ గెలిచాం. అందుకే రిజర్వ్ బెంచ్ సత్తా పరీక్షించాం. వారికీ అవకాశాలు ఇవ్వాలి కదా. ఉమేశ్ నాలుగు వికెట్లు తీశాడు. షమి కూడా ఫర్వాలేదు. ఇప్పటికీ ప్రయోగాలకు వెనకాడను. ఓ ప్రయోగం విఫలమైతే మరోకటి చేస్తా తప్ప ప్రయత్నాన్ని విరమించను' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.