
హైదరాబాద్: ఇంగ్లాండ్-ఇండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత జయపజయాల్లో పాలు పంచుకున్న యువ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఇండియా ఏ జట్టులో పాల్గొంటున్నాడు. పరిమిత ఓవర్ సిరీస్‌ల అనంతరం మొదలైన టెస్టు సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టుల్లోనూ పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియాలో చోటుపై చాహల్ స్పందించాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడే భారత జట్టులో చోటు గురించి ప్రస్తుతం ఆలోచించడంలేదని స్పష్టం చేశాడు.
ఈ నేపథ్యంలో తాజాగా చాహల్ మీడియాతో మాట్లాడుతూ...'వన్డేల్లో, టీ20ల్లో రన్‌రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్ చిన్న తప్పిదంతో మనకు దొరకుతాడు. కానీ, టెస్టుల్లో అలా కాదు. చాలా తెలివిగా బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాలి. ఇందుకు చాలా ఓపిక ఉండాలి. మన మెదడుకు బాగా పదును పెట్టాలి. వన్డే, టీ20లతో పోల్చుకుంటే టెస్టు ఫార్మాట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కనీసం 30 నుంచి 35 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. అదే టీ20ల్లో అయితే 4 ఓవర్లు వేస్తే సరిపోతుంది' అని చాహల్ అన్నాడు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన చాహల్ 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు రెండు అనధికార టెస్టులు ఆడనున్నాడు. చాహల్ టెస్టులాడి సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది. 2016లో రంజీ ట్రోఫీలోనే అతడు రెడ్ బాల్‌తో ఆడాడు. ఆ తర్వాత అతడు ఎర్ర బంతిని పట్టడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ చివరి రెండు టెస్టుల కోసం జట్టు ఎంపికపై దృష్టి పెట్టింది.
'చివరి రెండు టెస్టుల కోసం బీసీసీఐ ప్రకటించే జట్టులో నా స్థానం గురించి నేను ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇంగ్లాండ్ పర్యటనకు ఒకసారే వెళ్లాను. కానీ, ఇప్పుడు నా దృష్టంతా అనధికార టెస్టులపైనే. బీసీసీఐ ప్రకటించే జాబితాలో ఒకవేళ నా పేరు లేకపోతే ఆసియా కప్‌కు సిద్ధమవుతా. అంతే' అని చాహల్ వివరించాడు. ఇప్పటికే మూడో టెస్టులో పాల్గొననున్న జట్టు వివరాలను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించేసింది.