
నెదర్లాండ్స్ అద్భుతం..
ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆడిన తీరు - ఓ అద్భుతం. తనకంటే ఎంతో బలమైన దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించింది. పరాజయాన్ని చవి చూపించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆ తరువాత బౌలింగ్‌లో నెదర్లాండ్స్ ప్లేయర్లు చూపించిన తెగువ, దూకుడు ముందు దక్షిణాఫ్రికా వెలవెలబోయిన తీరు చూసి తీరాల్సిందే. దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో దాని స్థానంలో పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు చేరింది.

బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో..
తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 158 పరుగులు చేసింది. స్టెఫాన్ మైబర్గ్-37, మ్యాక్స్ ఓ డౌడ్- 29, టామ్ కూపర్- 35, కొలిన్ అక్కెర్‌మన్-41 పరుగులు చేశాడు. కొలిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 26 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. టామ్ కూపర్ అతనికి సహకారం అందించాడు. 19 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 35 పరుగులు చేశాడు.

వరుస వికెట్లు..
159 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మొదట్లోనే చేతులెత్తేసింది. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టి పడేయడంలో నెదర్లాండ్స్ బౌలర్లు నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోర్ నమోదు చేయలేకపోయాడు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాడు. ప్రారంభం నుంచీ వికెట్లు పడుతూ వచ్చాయి.

145 పరుగుల వద్దే..
ఓపెనర్లు క్వింటన్ డికాక్-13, టెంబా బావుమ-20, రిలీ రొస్సొ-25, ఎయిడెన్ మార్క్‌రమ్- 17, డేవిడ్ మిల్లర్-17, హెన్రిక్ క్లాసెన్- 21, వేన్ పార్నెల్-0, కేశవ్ మహరాజ్- 13.. ఇలా వికెట్లన్నీ ఒకదాని వెంట ఒకటి పడుతూ వచ్చాయి. ఏ దశలో కూడా కోలుకోలేకపోయింది దక్షిణాఫ్రికా. నెదర్లాండ్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్లను నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసింది దక్షిణాఫ్రికా.

గండం గట్టెక్కలేక..
దక్షిణాఫ్రికా ఓటమితో సెమీ ఫైనల్స్ ఈక్వేషన్లు అనూహ్యంగా మారిపోయాయి. దక్షిణాఫ్రికా కర్చీఫ్ వేసుక్కూర్చున్నప్పటికీ- నెదర్లాండ్స్ మట్టి కొట్టింది. ఆ జట్టు ఆశలను దారుణంగా దెబ్బ కొట్టింది. ఫలితంగా- దక్షిణాఫ్రికా తన గండాన్ని గట్టెక్కలేకపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌లో గెలిచి ఉంటే ప్రొటీస్ టీమ్ సెమీఫైనల్స్ చేరుకుని ఉండేదే. న్యూజిలాండ్‌తో తలపడి ఉండేదే. చివరి హర్డిల్‌ను అధిగమించలేకపోయిందా జట్టు.

గేమ్ ఛేంజర్..
ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది మాత్రం ఓ క్యాచ్. దీన్ని గేమ్ ఛేంజర్‌గా చెప్పుకోవచ్చు..క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా భావించవచ్చు. ఇలా ఎన్ని ఉపమానాలైనా ఇచ్చుకోదగ్గ క్యాచ్ అది. ఆ క్యాచ్- అత్యంత ప్రమాదకర డేవిడ్ మిల్లర్‌ను పెవిలియన్ దారి పట్టించింది. మ్యాచ్‌ను మలుపు తిప్పింది. విజయాన్ని నెదర్లాండ్స్‌కు సొంతం చేసింది. ఈ ఒక్క క్యాచ్‌తోనే దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ను ఓడిపోయిందంటే- దానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
16వ ఓవర్‌లో..
నెదర్లాండ్స్ ఇన్నింగ్ 16వ ఓవర్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. గ్లోవర్ సంధించిన ఓవర్ అది. గ్లోవర్ అవుట్ సైడ్ ఆఫ్‌గా విసిరిన బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడబోయాడు మిల్లర్. టైమింగ్ మిస్ అయ్యాడు. అది కాస్త బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకుని గాల్లోకి ఎగిరింది. అక్కడే పొంచివున్న వాన్ డెర్ మెర్వ్.. కొన్ని గజాల దూరం పాటు గాల్లో ఉన్న బంతినే చూస్తూ వెనక్కి పరుగెత్తుతూ- దాన్ని డైవ్ చేసి మరీ అందుకున్నాడు. అక్కడితోనే దక్షిణాఫ్రికా పరాజయం పరిపూర్ణమైనట్టనిపించింది.


Click it and Unblock the Notifications












