ఐపీఎల్‌లో జట్లను పెంచాలి.. ఇదే సరైన సమయం: రాహుల్ ద్రవిడ్

IPL Is Ready For Expansion - Rahul Dravid

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విస్తరణపై టీమిండియా మాజీ సారథి, నేషనల్ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లీగ్‌ను మరింత విస్తరించేందుకు ఇది సరైన సమయమన్నాడు. లీగ్‌ నాణ్యతలో తేడా రాకుండా జట్ల సంఖ్యను పెంచినట్లయితే యువ క్రికెటర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ పరంగా గత దశాబ్ధం భారత్‌కు అత్యుత్తమమని పేర్కొన్నాడు. 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్‌ ట్రోఫీలను గెలుచుకోవడంతో పాటు టి20 ప్రపంచకప్‌లోనూ గొప్ప ప్రదర్శనలు నమోదయ్యాయని అన్నాడు.

టైమ్ ఆగయా..

టైమ్ ఆగయా..

రాజస్తాన్‌ రాయల్స్‌ సహ యజమాని మనోజ్‌ బదాలే రాసిన పుస్తకం ‘ఎ న్యూ ఇన్నింగ్స్‌' వర్చువల్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్‌ ఈ అంశంపై మాట్లాడాడు. ‘ప్రతిభపరంగా చూస్తే ఐపీఎల్‌ను విస్తరించాల్సిన సమయం వచ్చిందనేది నా అభిప్రాయం. సత్తా ఉన్న ఎందరో క్రికెటర్లకు ఈ వేదికపై ఇంకా ఆడే అవకాశం దక్కడం లేదు. ఐపీఎల్‌లో జట్ల సంఖ్య పెంచితే వీరందరికీ అవకాశం లభిస్తుంది. ప్రతిభ చాటేందుకు చాలామంది యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే లీగ్‌ నాణ్యతలో ఏమాత్రం తేడా రాకుండా ఈ విస్తరణ చేపట్టాలి. తొలుత రంజీలకు ఎంపిక కావాలంటే రాష్ట్ర సంఘాలపై ఆధారపడాల్సి వచ్చేది. క్రికెటర్లకు పరిమిత అవకాశాలుండేవి. ఇప్పడు ఐపీఎల్‌తో పరిస్థితి మారిపోయింది.

సీనియర్లతో ఆడితే..

సీనియర్లతో ఆడితే..

కోచ్‌లుగా మేం కొంత మాత్రమే సహకరించగలం. కానీ అనుభవం ద్వారానే యువ ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు. లీగ్‌లో యువ దేవదత్‌... సీనియర్లు విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లతో కలిసి బ్యాటింగ్‌ చేశాడు. ఈ అనుభవం నేషనల్ టీమ్‌కు ఆడటానికి ఉపయోగపడుతుంది. ఐపీఎల్‌లో రాణించడం వల్లే నటరాజన్‌ టీమిండియాకు ఎంపికయ్యాడు' అని ద్రవిడ్‌ గుర్తు చేశాడు. రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన ముంబై ఇండియన్స్‌ను ద్రవిడ్‌ అభినందించాడు. వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో పాటు యువకులతో కూడిన ముంబై అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించాడు. ద్రవిడ్‌ అభిప్రాయాన్ని మనోజ్‌ స్వాగతించాడు. వచ్చే ఏడాది 9 జట్లతో కూడిన ఐపీఎల్‌ నిర్వహణ కచ్చితంగా సాధ్యమేనని వ్యాఖ్యానించాడు. ఈ దిశగా బీసీసీఐ ఆలోచించాలని సూచించాడు.

ఫ్రాంచైజీల్లో కలవరపాటు..

ఫ్రాంచైజీల్లో కలవరపాటు..

ప్రస్తుతం గరిష్ఠంగా ఎనిమిదిమంది విదేశీ క్రికెటర్లతోపాటు మొత్తం 18 నుంచి 25 మంది ఆటగాళ్లు ఒక్కో జట్టులో ఉండాలి. ఇక తుది 11 మందిలో నలుగురు విదేశీ క్రికెటర్లు మాత్రమే ఉండాలి. ‘నాణ్యమైన జట్లను ఏర్పాటు చేసుకోవడంలో ఫ్రాంచైజీలు ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఫ్రాంచైజీలను తొమ్మిది లేదా 10కి పెంచితే జట్లలో నాణ్యత మరింత తగ్గుతుంది. ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది. లీగ్‌కు సంబంధించి బీసీసీఐ చేసుకున్న ఒప్పందాల గడువు 2023 వరకు ఉన్నాయి. అవి ఇప్పటికిప్పుడు మార్చుకునే పరిస్థితి లేదు. దాంతో ఆదాయాన్ని అన్ని జట్లకు పంచాలి. కొత్త జట్లు వస్తే తమకు వచ్చే వాటా తగ్గుతుంది.' అని ఓ ఫ్రాంచైజీ అధికారి అభిప్రాయపడ్డారు.

ఐదుగురు ఫారిన్ ప్లేయర్లు..

ఐదుగురు ఫారిన్ ప్లేయర్లు..

లీగ్ నాణ్యతకు పరిష్కారం ఉందని ఓ బీసీసీఐ అధికారి అన్నారు. తుది జట్టులో నలుగురికి బదులు ఐదుగురు విదేశీ క్రికెటర్లను తీసుకోవాలని సూచించారు. ‘నలుగురే అనే నిబంధనతో నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు పలు సీజన్లలో బెంచ్‌కే పరిమితమవుతున్నారు. జట్టులో ఇంకో విదేశీ క్రికెటర్‌ను తీసుకొంటే మరింత సమతూకం వస్తుంది' అని ఆ అధికారి అన్నారు. కానీ ఐపీఎల్‌ ప్రధాన లక్ష్యం భారత దేశవాళీ క్రికెటర్ల నైపుణ్యాలను పెంచడం. అలాంటప్పుడు తుది జట్టులో ఎక్కువమంది విదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించాలన్న నిర్ణయాన్ని ఐపీఎల్‌ పాలకమండలి అంగీకరిస్తుందా అన్నది ప్రశ్న. అయితే జట్లు పెరగడం వల్ల మరింత మంది యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.

గంభీర్.. ఇదే ఆర్‌సీబీ టీమ్‌తో రోహిత్ శర్మ టైటిల్ గెలవగలడా: ఆకాశ్ చోప్రా

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, November 14, 2020, 8:31 [IST]
Other articles published on Nov 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X