
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం:
తాజాగా నవదీప్ సైనీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'గాయపడ్డా బౌలింగ్ చేయగలవా అని అజింక్య రహానే భాయ్ అడిగాడు. అందుకు నేను ఔననే జవాబిచ్చాను. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం దక్కినా గాయపడటంతో బాధపడ్డా. అప్పటివరకు నేను బాగున్నాను. కానీ హఠాత్తుగా గాయపడ్డాను. సుదీర్ఘకాలం తర్వాత అవకాశం దక్కింది. అందుకే అత్యంత కీలకమైన ఆటలో నాకే ఎందుకిలా అయిందనుకున్నా. గాయపడ్డా జట్టుకు ఎలాగైనా సాయపడాలని ఆ దేవుడిని కోరుకున్నా. ఎందుకంటే.. ఇలాంటి మ్యాచులు మళ్లీమళ్లీ రావని తెలుసు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నా. త్వరలోనే ఫిట్నెస్ సాధిస్తా' అని అన్నాడు.

అన్ని వికెట్లూ ప్రత్యేకమే:
టెస్టుల్లో తీసిన నాలుగు వికెట్లలో మొదటి వికెట్ ఎంతో ప్రత్యేకమని సైనీ తెలిపాడు. 'అన్ని వికెట్లూ ప్రత్యేకమే. అయితే మొదటి వికెట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అదే జరిగేంత వరకు మనం మొదటి వికెట్ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. బౌన్స్‌కు అనుకూలించే ఆసీస్ పిచ్‌లు ఊరించినా అన్ని బంతులు షార్ట్ పిచ్‌లో వేయలేం కదా. అక్కడ రాణించాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. వారు చివరి వరకు వదిలి పెట్టరు. జట్టు యాజమాన్యం నాకెంతో మద్దుతుగా నిలిచింది. కెప్టెన్ రహానే, రోహిత్ భయ్యా నాకు అండగా నిలిచారు. రంజీ తరహాలోనే బంతులు వేయాలని సూచించారు' అని సైనీ పేర్కొన్నాడు.

రంజీ తర్వాతే ఒక్కో మెట్టు ఎదిగా:
'నా తొలి మ్యాచులో మహ్మద్ సిరాజ్ పూర్తిగా నాతోనే ఉన్నాడు. వేగం ముఖ్యమే అయినా లైన్ అండ్ లెంగ్త్ మీదా దృష్టి పెట్టాలని నాకు సూచించాడు. అతడు మంచి మిత్రుడు. సిరాజ్ భిన్నమైన బౌలర్. తండ్రి మరణించినా ఆసీస్‌లోనే ఉండి సాహసం చేశాడు. అతడు సాధించిందంతా జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది. నా ఎదుగుదలలో టెన్నిస్ బంతి క్రికెట్ పాత్ర ఎంతో ఉంది. రంజీల్లోకి వచ్చాకే ప్రొఫెషనల్ క్రికెట్‌పై దృష్టి పెట్టా. అంతకు ముందు ఎలాంటి లక్ష్యం లేకుండా ఆడేవాడినని. రంజీ తర్వాతే ఒక్కో మెట్టు ఎదిగా' అని సైనీ వెల్లడించాడు.
అతడికి అవకాశాలు ఇవ్వనప్పుడు.. ఎందుకు రిటైన్ చేసుకోవాలి: కేకేఆర్‌పై గంభీర్ ఫైర్