హైదరాబాద్: ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ క్రికెటర్ రాస్ వైట్లే. నాట్‌వెస్ట్ టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం యార్క్ షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో వోర్స్‌స్టెర్ షైర్ ఆటగాడు రాస్ వైట్లే ఆరు బంతుల్ని ఆరు సిక్సులుగా మలిచాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్ షైర్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం 234 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వోర్స్‌స్టైర్ షైర్ జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రాస్ వైట్లే యార్క్‌షైర్ స్పిన్నర్ కార్ల్ కార్వెర్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో ఆరు బంతుల్ని ఆరు సిక్సులుగా బాదాడు.

అదే ఓవర్‌లో ఒక వైడ్ కూడా పడటంతో మొత్తం 37 పరుగులు లభించాయి. 25 బంతుల్లో 8 సిక్సులు, 2 ఫోర్లు సాయంతో 65 పరుగులు చేసిన రాస్ వైట్లే ఐదో వికెట్ గా అవుటయ్యాడు. రాస్ వైట్లే చెలరేగి ఆడినప్పటికీ వోర్స్‌స్టెర్ షైర్ జట్టుకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో యార్క్ షైర్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్‌లో ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలిచిన ఆరో క్రికెటర్‌గా రాస్ వైట్లే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు గ్యారీ సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి( భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్(భారత్), జోర్దాన్ క్లార్క్(ఇంగ్లండ్)లు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన ఆటగాళ్లు.