ఇండోర్: భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ అక్టోబర్ 8న న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆడతాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇప్పటికే 2-0తో టెస్ట్ సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. హోల్కర్ స్టేడియంలో జరిగే మూడో టెస్టులో గెలిచి వైట్‌వాష్ చేయాలని ఉత్సాహంగా ఉంది.
రెండో టెస్టులో చేతి బొటన వేలుకి గాయం కావడంతో శిఖర్ ధావన్.. మూడో టెస్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్.. ధావన్ స్థానంలో ఆడనున్నాడు. కెఎల్ రాహుల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమవడంతో గంభీర్‌కు అవకాశం కల్పించారు. అయితే రెండో టెస్టులో గంభీర్ రిజర్వు బెంచ్ కే పరిమితమయ్యాడు.

రెండో టెస్టు మ్యాచ్‌కు గంభీర్‌ను ఎంపిక చేయకపోవడంపై కోహ్లీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో కూడా గంభీర్ ఆడటం అనుమానంగానే మారింది. కాగా, శుక్రవారం గంభీర్ ఆడుతున్నాడంటూ కోహ్లీ స్పష్టమైన ప్రకటన చేశాడు.
ధావన్ గాయం కారణంగా దూరం కావడంతో మూడో టెస్టులో గంభీర్ ఆడుతున్నాడని, మార్పు సహజమని తెలిపాడు. కాగా, అక్టోబర్ 8న జరగనున్న మూడో టెస్టులో మురళీ విజయ్‌తో కలిసి గంభీర్ భారత ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయనున్నాడు
అయితే, గంభీర్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో వేచిచూడాలి మరి. ఒకప్పుడు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో భారత రెండో 'వాల్' అని అనిపించుకున్న గంభీర్.. తన ప్రతిభను చాటి టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడో లేదో మూడో టెస్టులో తేలిపోయే అవకాశం ఉంది.
కాగా, ఆగస్టు 2014లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు గంభీర్. భారత్ తరపున 56 టెస్టులాడిన గంభీర్.. 4,406 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 21 అర్ధ శతకాలున్నాయి.