ఆదిలోనే ఎదురుదెబ్బ:
ఆసీస్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కమ్మిన్స్ రెండో ఓవర్లో ఓపెనర్ లెవిస్ (1)ను పెవిలియన్ పంపాడు. కమిన్స్ తన తొలి నాలుగు ఓవర్లలో మూడు మేడిన్లు వేసి విండీస్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశాడు. గేల్ తనదైన దూకుడు కనబరుస్తూ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే ఓవర్లో రెండు సార్లు ఔట్ నుంచి బయటపడ్డ గేల్‌ను.. స్టార్క్ పెవిలియన్ పంపాడు. దీంతో విండీస్ కష్టాల్లో పడింది.

మిచెల్ స్టార్క్ మాయ:
ఈ దశలో షాయ్ హోప్ నిలకడగా ఆడి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. మరోవైపు పూరన్ వేగంగా ఆడాడు. హోప్.. పూరన్‌తో మూడో వికెట్‌కు 68 పరుగులు, హెట్‌మయెర్ (21)తో నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే హోప్ హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్, రస్సెల్ (15) అవుట్ అయినా.. క్రీజులో హోల్డర్‌తో పాటు బ్రాత్‌వైట్ (16) ఉండడంతో.. విండీస్ విజయంపై ఆశలు సజీవంగా ఉన్నాయి. 30 బంతుల్లో 38 పరుగులు అవసరమైన దశలో మిచెల్ స్టార్క్.. బ్రాత్‌వైట్, హోల్డర్‌లను అవుట్ చేయడంతో విండీస్ ఓటమి ఖరారైంది. చివరి ఓవర్లో నర్స్ వరసగా 4 ఫోర్లు కొట్టినా.. ఫలితం దక్కలేదు. మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీసాడు.
పెవిలియన్‌కు క్యూ:
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్‌కు విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. విండీస్ బౌలర్ల ధాటికి ఆసీస్ కెప్టెన్ ఫించ్ (6), వార్నర్ (3), ఖవాజా (13), మ్యాక్స్‌వెల్ (0), స్టొయినిస్ (19)లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆసీస్ 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. స్మిత్ (103 బంతుల్లో 7 ఫోర్లతో 73) మాత్రం బ్యాటింగ్ కొనసాగించాడు.

కౌల్టర్‌నైల్ ఎదురుదాడి:
ఆరో వికెట్‌కు అలెక్స్ క్యారీ (45)తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన స్మిత్.. ఆ తర్వాత కౌల్టర్‌నైల్ సహకారంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. కౌల్టర్ నైల్ విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో స్కోర్ బోర్డు పరిగెత్తింది. ముఖ్యంగా కౌల్టర్‌నైల్ (60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 92) స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ తరహాలో విరుచుకుపడ్డాడు. తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన విండీస్ బౌలర్లు.. చివర్లో ధారాళంగా పరుగులు ఇచ్చారు. చివరకు ఆసీస్ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్‌వైట్(3/67), ఓషానె థామస్(2/63), కాట్రెల్(2/56), రస్సెల్(2/41) లు రాణించారు.


Click it and Unblock the Notifications












