
బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆటగాడిని కొనుగోలు చేసింది. యువ బౌలర్ టి. నటరాజన్‌ను వేలంలో సన్‌రైజర్స్ దక్కించుకుంది. కోటి రూపాయల కనీస ధరతో వేలంలో బరిలోకి దిగిన నటరాజన్‌ను హైదరాబాద్ 4 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. పేస్ బౌలర్ అయినా నటరాజన్ గతంలో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫునే ఆడాడు. కానీ ఈ సారి రిటెన్షన్ జాబితాలో నటరాజన్‌కు చోటు దక్కలేదు. అయినప్పటికీ వేలంలో టి. నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ కొనుగోలు చేసింది. గతంలో నటరాజన్‌కు 40 లక్షల రూపాయలు చెల్లించిన రైజర్స్ ఈ సారి మాత్రం 4 కోట్ల రూపాయలు చెల్లించనుంది. దీంతో గతంలో కంటే 3 కోట్ల 60 లక్షల రూపాయలను నటరాజన్ ఎక్కువగా అందుకోనున్నాడు. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ పేసర్ 20 వికెట్లు పడగొట్టాడు.
మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మొదటగా టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్, ఆ తర్వాత వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌ను, పేస్ బౌలర్ టి. నటరాజన్‌ను కొనుగోలు చేసింది. వేలంలో వాషింగ్టన్ సుందర్‌ను 8 కోట్ల 75 లక్షల రూపాయలకు దక్కించుకోగా, నికోలస్ పూరన్‌ను 10 కోట్ల 75 లక్షల రూపాయలకు, టి. నటరాజన్‌ను 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
ఇప్పటివరకు జరిగిన మెగా వేలంలో ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నిలిచాడు. కిషన్‌ను ముంబై ఇండియన్స్ 15 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఆ తర్వాత ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా రెండో స్తానంలో టీమిండియా యువ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ నిలిచాడు. గతంలో తమ జట్టుకే ఆడిన దీపక్ చాహర్‌ను చెన్నైసూపర్ కింగ్స్ 14 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ తర్వాత మూడో స్థానంలో నికోలస్ పూరన్, హసరంగ, హర్షల్ పటేల్ నిలిచారు. పూరన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్, హసరంగను, హర్షల్ పటేల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేశాయి. వాళ్లను ఆయా జట్లు వేలంలో 10 కోట్ల 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాయి.