సెలక్షన్‌లోని పొరపాట్లే ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓటమికి కారణం: మాజీ కెప్టెన్

లండన్: టీమిండియా అద్భుతమైన జట్టే అయినా ఐసీసీ టోర్నీల్లో కొన్ని పొరపాట్లు చేస్తోందని ఇంగ్లండ్ మాజీ సారథి, ప్రముఖ వ్యాఖ్యాత నాజర్ హుస్సేన్ అన్నాడు. సెలక్షన్‌లోని పొరపాట్లు, ఆటగాళ్ల ఎంపిక, మిడిలార్డర్‌లో తడబాటుతో కీలక మ్యాచుల్లో భారత్ ఓటమి పాలవుతోందని ఆయన పేర్కొన్నాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం భారత్ ఒక్క మెగాటోర్నీ గెలవలేకపోయింది. నాకౌట్ దశకే పరిమితమై తృటిలో టైటిల్ చేజార్చుకుంటోంది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడింది. 2017 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫైట్‌లో చేతులెత్తేసింది. ఇక గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ సెమీఫైనల్లో ఓటమిపాలైంది.
నాజర్ హుస్సేన్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్ట్'లో మాట్లాడుతూ... 'ఐసీసీ టోర్నీల్లో భారత సెలక్షన్‌లో కొన్ని పొరపాట్లు ఉంటున్నాయి. అందరూ పరిస్థితులకు కొంత అలవాటు పడటం లేదు. క్రికెట్ ఆటకు సంబంధించి ఒకే ప్రణాళిక ఉంటే సరిపోదు. టాప్ ఆర్డర్ కుప్పకూలితే.. కష్ట సమయాల్లో మిడిలార్డర్ ఆదుకోవాలి. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు జట్టు తడబడుతోంది. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఇదే జరిగింది' అని అన్నాడు.
'టీమిండియా టాప్ ఆర్డర్ చాలా చాలా బాగుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శతకాల మీద శతకాలు చేస్తారు. కానీ మిడిలార్డర్ వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయి. మిచెల్ స్టార్క్, జోస్ హేజిల్‌వుడ్ వంటి పేసర్లు చెలరేగి తొలి నాలుగు వికెట్లు తీస్తే మిడిలార్డర్ విలవిల్లాడుతోంది. సరైన సమయంలో ఒక్క మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కూడా ఆదుకోవడం లేదు. చివరగా ఒక్క బ్యాట్స్‌మన్ నిలబడితే.. అతడిపైనే ఎక్కువగా భారం పడుతోంది. ఆదిలోనే రోహిత్, కోహ్లీ వికెట్లు కోల్పయి.. భారత్ 20/2తో ఉంటే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. గెలుపు గీత దాటాలంటే ఒక ప్రణాళిక సరిపోదు, రెండోదీ ఉండాలి' అని నాజర్ హుస్సేన్ పేర్కొన్నాడు.
ఎంత అద్భుతంగా రాణిస్తున్నా ఐసీసీ టోర్నీల్లో భారత్ గెలవకపోవడానికి దురదృష్టమే కారణమని టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవలే తెలిపాడు. 'మేం చివరిసారిగా 2013లో చాంపియన్స్ ట్రోఫీ సాధించాం. అప్పటి నుంచి జరిగిన 3-4 ఐసీసీ టోర్నీల్లో 2-3 సార్లు సెమీస్, ఫైనల్లో ఓడాం. 2015 ప్రపంచకప్ సెమీస్ ఆస్ట్రేలియా చేతిలో ఓడాం. 2019లో కూడా అదే సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్నాం. మా బ్యాడ్ లక్. కివీస్‌తో టాపార్డర్ వైఫల్యం మా కొంపముంచింది. ప్రత్యర్థిని 250 పరుగులకు కట్టడి చేసిన పరిస్థితుల్లో ఇలా జరగడం చాలా అరుదు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా నోబాల్ వేయడంతో మూల్యం చెల్లించుకున్నాం. ఇక టోర్నీ ఆసాంతం అదరగొట్టి ఇలా కీలక మ్యాచ్‌లో చెతులెత్తేయడం మా దురదృష్టమే' అని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications