
విండ్‌హోక్: సెప్టెంబర్ నెలలో యూఏఈ, ఒమన్‌లో ప్రారంభమయ్యే మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021 కోసం జట్లను ఆయా దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మొదట తమ జట్లను ప్రకటించాయి. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు కూడా తమ 15 మంది ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్‌ల లిస్టును ప్రకటించాయి. తాజాగా సదరన్ ఆఫ్రికా దేశం నమీబియా కూడా టీ20 ప్రపంచకప్ 2021కు సంబంధించి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నమీబియా ప్రపంచకప్ జట్టును గెర్హాడ్ ఎరాస్‌మస్ ముందుండి నడిపించనున్నాడు.
దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్‌కు నమీబియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం విశేషం. 2016లో దక్షిణాఫ్రికా తరఫున టీ20 ప్రపంచకప్ ఆడిన డేవిడ్.. తన తండ్రి స్వదేశమైన నమీబియా నుంచి ఈసారి ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. 36 ఏళ్ల డేవిడ్ వీస్ 2016 వరకు ఆరు వన్డేలు మరియు 20 టీ20ల్లో దక్షిణాఫ్రికా జట్టు తరఫున పాల్గొన్నాడు. 2017లో దక్షిణాఫ్రికా జట్టుకు గుడ్ బై చెప్పాడు. అనంతరం నమీబియా జట్టుకు ఆడాడు. డేవిడ్ తండ్రి నమీబియాలో జన్మించిన కారణంగా అతడు నమీబియా కోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అర్హత సాధించాడు.
హెడ్ కోచ్ పియరీ డీ బ్రున్ శిక్షణలో రాటుదేలిన తమ ఆటగాళ్లతో తొలిసారిగా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తలపడేందుకు నమీబియా సిద్ధమవుతోంది. మేనేజ్‌మెంట్‌లో దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ కూడా ఉండటం మరో విశేషం. కాగా 2019లో దుబాయ్‌లో జరిగిన క్వాలిఫైయర్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించడం ద్వారా ప్రపంచకప్‌నకు నమీబియా అర్హత సాధించింది. ఇక అక్టోబరు 18న శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచులోనే లంక వంటి పటిష్ట జట్టును ఓడించడం నమీబియాకు కాస్త కష్టమనే చెప్పాలి.
నమీబియా టీ20 జట్టు ఇదే:
గెర్హాడ్ ఎరాస్‌మస్(కెప్టెన్), స్టీఫెన్ బార్డ్, కార్ల్ బిర్కెన్‌స్టాక్, మిచావు డు ప్రీజ్, జాన్ ఫ్రిలింక్, జానే గ్రీన్, జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్, బెర్నార్డ్ షోల్ట్, బెన్ షికాంగో, జేజే స్మిత్, రూబెన్ ట్రంపెల్‌మాన్, మైకేల్‌వాన్ లింగన్, డేవిడ్ వీజ్, క్రెయిగ్ విలియమ్స్, పిక్కీ యా ఫ్రాన్స్, మారిషస్ న్గుపిత (రిజర్వ్ ప్లేయర్).
మరోవైపు అఫ్గానిస్థాన్ టీ20 కెప్టెన్‌గా మహ్మద్ నబీ ఎంపికయ్యాడు. దీంతో మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ 20221కు నబీ అఫ్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇక కెప్టెన్‌గా ఉన్న తనని సంప్రదించకుండానే టీ20 ప్రపంచకప్‌నకు జట్టును ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేస్తూ రషీద్ ఖాన్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని రషీద్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
అఫ్గానిస్థాన్ జట్టు ఇదే:
రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, రహ్మానుల్లా గుర్బాజ్, కరీమ్ జనత్, హజ్రతుల్లా జాజాయ్, గుల్బాడిన్ నైబ్, ఉస్మాన్ ఘని, నవీన్ ఉల్ హక్, అస్ఘర్ అఫ్గాన్, హమీద్ హసన్, మహ్మద్ నబీ (కెప్టెన్), షరాఫుద్దీన్ అష్రాఫ్, నజీబుల్లా జద్రాన్, దావ్లత్ జద్రాన్, హష్మతుల్లా షాహిది, షాపూర్ జద్రాన్, మహ్మద్ షహ్జాద్, కాయిస్ అహ్మద్.