దాయాది దేశం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కోసం ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం పీసీబీ చైర్మన్‌గా ఉన్న నజాం సేథీతోపాటు మరో ఇద్దరు పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై నజాం సేథీ వివరణ ఇచ్చాడు. తాను పీసీబీ చైర్మన్ పోటీలో లేనని, తనకు ఈ పోరులో పాల్గొనడం ఇష్టం లేదని స్పష్టం చేశాడు.
గతేడాది చివర్లో అప్పటి పీసీబీ చైర్మన్ రమీజ్ రజాను తొలగించడంతో బోర్డు వ్యవహారాలు చూసుకోవడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ హెడ్‌గా ఉన్న నజామ్ సేథీ ఇప్పటి వరకు పీసీబీ వ్యవహారాలు చూసుకున్నారు. వీటిలో ఆసియా కప్ 2023 నిర్వహణ నుంచి వరల్డ్ కప్‌లో పాల్గొనడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ కోచింగ్ యూనిట్, సెలెక్షన్ కమిటీలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చిందీ కమిటీ.

అయితే ఈ నెల 21తో ఈ కమిటీ పదవీ కాలం ముగుస్తుంది. దీంతో పీసీబీ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా పీసీబీని బాగు చేసుందుకు నజాం సేథీ కష్టపడటంతో అతను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని, తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని నజాం సేథీ స్పష్టం చేశాడు.
'ఆసిఫ్ జర్దానీ, షహబాజ్ షరీఫ్ మధ్య నేను కూడా పోటీ పడాలని అనుకోవడం లేదు. అలాంటి నిలకడ లేని పరిస్థితి పీసీబీకి ఏమాత్రం మంచిది కాదు. అందుకే ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పీసీబీ చైర్మన్ పదవి కోసం పోటీ పడకూడదని నిర్ణయించుకున్నా. అందరు స్టేక్ హోల్డర్లకు గుడ్ లక్' అని నజాం సేథీ ట్వీట్ చేశాడు. పీసీబీ వ్యవహారాల్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌దే తుది నిర్ణయం అని తెలిసిందే.