అక్కరకొచ్చిన ఐపీఎల్ అనుభవం: బౌలర్లను రఫ్ఫాడించిన ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్!

సౌతాంప్టన్: అనుభవం అక్కరకు రావడం అంటే ఇదే మరి! ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లల్లో ఆడిన అనుభవాన్ని భారత క్రికెట్ జట్టు బౌలర్లపై ఉపయోగించాడు ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ. తన జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీని నమోదు చేసుకున్నాడు. చివరి ఓవర్‌లో అవుట్ కావడానికి ముందు కూడా బంతిని బౌండరీ దాటించాడంటే టీమిండియా బౌలర్ల కిటుకులన్నీ అతని బాగా తెలుసనే అనుకోవాలి. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి, క్యాచ్ అవుట్ అయ్యాడు. లేకుంటే- ఫలితం మరోలా ఉండేది.

హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడిగా..
ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నాడు మహమ్మద్ నబీ. ఆ జట్టులో నబీ ఆల్ రౌండర్ పాత్రను పోషిస్తున్నాడు. స్పిన్నర్‌గా బంతితో, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా బ్యాట్‌తో రాణిస్తున్నాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడిగా ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లను ఆడాడు. ఈ నేపథ్యంలో- టీమిండియాలో ఉన్న బౌలర్లందరినీ ఎదుర్కొన్నాడతను. ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్ మహమ్మద్ షమీ, ముంబై ఇండియన్స్‌లో ఆడుతున్న జస్‌ప్రీత్ బూమ్రా, కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో ఉన్న కుల్‌దీప్ యాదవ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫు నుంచి యజువేంద్ర చాహల్.. ఇలా బౌలర్లందరినీ ఎదుర్కొన్న అనుభవం మహమ్మద్ నబీకి ఉంది. దాన్నే తాజాగా ఉపయోగించాడు.

55 బంతుల్లో 52 పరుగులు..
టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తోన్న సమయంలో క్రీజులోకి వచ్చాడు మహమ్మద్ నబీ. నిజానికి- తోటి బ్యాట్స్‌మెన్లలాగే అతనూ పెవిలియన్‌కు క్యూ కట్టాల్సిన వాడే లేదా పరుగుల కోసం చెమటోడ్చాల్సిన వాడే. దీనికి భిన్నమైన ఆటతీరును ప్రదర్శించాడు నబీ. భారత బౌలర్లపై దూకుడుగా ఆడాడు. తోటి బ్యాట్స్‌మెన్లు సింగిల్ కోసం కష్టపడుతున్న సమయంలో నబీ బౌండరీలను సాధించాడు. 55 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్‌లో ఓ సిక్సర్ కూడా నమోదైంది. మొత్తం 55 బంతుల్లో అయిదు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 52 పరుగులు చేశాడు. జట్టులో అత్యధిక స్కోరును మరోసారి సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

నబీని ఇబ్బంది పెట్టలేకపోయిన బౌలర్లు..
ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్లందరూ భారత బౌలర్లను ఎదుర్కొనడానికి ఇబ్బందిపడ్డారు. కిందామీదా పడ్డారు. గట్టిగా ఆడితే బంతి ఎక్కడ గాల్లోకి లేస్తుందో.. ఎవరి చేతుల్లో వాలుతుందో అనే భయం ఆప్ఘన్ బ్యాట్స్‌మెన్లలో కనిపించింది. అందుకే భారీ షాట్లను ఆడటానికి వెనుకంజ వేశారు. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన నబీ.. స్వేచ్ఛగా షాట్లను ఆడాడు. ఖచ్చితమైన షాట్లు అతని బ్యాట్ నుంచి వెలువడ్డాయి. కొన్ని క్లాసికల్ షాట్లను ఆడాడు నబీ. క్రీజులో స్వేచ్ఛగా కదిలాడు. ఎలాంటి ఇబ్బందులనూ ఎదుర్కొనలేకపోయాడు భారత బౌలర్ల నుంచి. బంతి ఎక్కడ వాలుతుందనేది ముందే పసిగట్టగలిగాడు. దానికి అనుగుణంగా ఫుట్‌వర్క్‌ను సవరించుకుంటూ షాట్లను ఆడాడు.

ఒక్క రాంగ్ షాట్ కూడా లేదు..
అవుట్ అయ్యేంత వరకూ ఒక్క రాంగ్ షాట్ కూడా నబీ ఆడలేదు. పైగా 95 శాతం స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ కొనసాగించాడు. దీనికి ప్రధాన కారణం- ఐపీఎల్‌లో అతను ఆడిన అనుభవమేనని చెప్పుకోవడంలో సందేహాలు అక్కర్లేదు. ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తరఫున నబీ ఆడిన అనుభవం.. అతనికి ప్రపంచకప్‌లో ఉపయోగపడింది. తన బ్యాటింగ్ తీరుతో జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లగలిగాడు. చివరిలో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. లేకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు క్రికెట్ విశ్లేషకుల నుంచి వ్యక్తమౌతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications