
హైదరాబాద్: బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నం.1 కావడమే తన లక్ష్యమని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. సికింద్రాబాద్‌లోని ఆక్సీలియం పాఠశాలను ఆమె బుధవారం సందర్శించారు. జాన్సన్ అండ్ జాన్సన్ శానిటరీ నాప్కిన్ బ్రాండ్ స్టేఫ్రీ సంస్థ ఆక్సిలియం హైస్కూల్‌లో 'డ్రీమ్స్ ఆఫ్ ప్రోగ్రెస్' ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆక్సిలియం స్కూల్ విద్యార్థి అయిన సింధు ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
ఈ సందర్భంగా ఆమె ప్రసంగించి మాట్లాడారు. కొద్ది నెలల క్రితమే ప్రపంచ స్థాయిలో రెండో స్థానం సాధించిన సింధు.. భారత్ తరపున ఆడితే చాలని చిన్నతనంలో ఊహించుకునే దానిని అంటూ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అలాంటిది భారత్‌కు ఆడుతుండటం.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనే టాప్‌గా ఉండాలనుకోవడంలో ఆశ్చర్యపడాల్సిన అవసర్లేదన్నారు.
స్టేఫ్రీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సింధు.. డ్రీమ్స్ ఆఫ్ ప్రోగ్రెస్ పేరుతో ఆ బ్రాండ్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాఠాశాల విద్యార్థులతో ముచ్చటించారు. సింధు పాఠశాల విద్యను ఇక్కడే అభ్యసించటం విశేషం. మహిళల వ్యక్తిగత శుభ్రత, రుతుస్రావంపై సింధు మాట్లాడారు. లక్ష్యసాధనలో రుతుక్రమం ఎప్పటికీ ఆటంకం కాకూడదని బాలికలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
నెలసరి అనేది శరీర సహజ ధర్మమని... అమ్మాయిలు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో కెరీర్‌లో ముందడుగు వేయాలని సూచించింది. మహిళలు తమ శక్తిపై నమ్మకముంచాలని పేర్కొంది. తన తల్లి విజయ తనకు స్ఫూర్తిప్రదాత అని చెప్పింది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా విజయం అందుకోలేమని... పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సాగడమే ఇందుకు పరిష్కారమని సూచించింది. ఇతరులను గౌరవించడం, క్రమశిక్షణ అనే విలువల్ని ఈ పాఠశాలలోనే నేర్చుకున్నానన్న సింధు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పేర్కొంది. విజయానికి నిరంతర కృషి ఒక్కటే మార్గమని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. చిన్నారులు తమ కలల్ని సాకారం చేసుకొనేందుకు ఇప్పటినుంచే కృషిచేయాలని సూచించారు.