ముంబై: తన వీడ్కోలు మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటనను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2013 నవంబరులో వాంఖేడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ వీడ్కోలు పలికాడు.
ఆ మ్యాచ్‌లో తాను అవుటైన తీరును కూడా తన సోదరుడు అజిత్ టెండుల్కర్‌తో చర్చించినట్లు చెప్పాడు. అది చివరి టెస్ట్ మ్యాచ్ అయినప్పటికీ అజిత్‌తో తాను అవుటైన విధానాన్ని చర్చించానని తెలిపారు. తన జీవితంలో తన సోదరుడు అజిత్ పాత్రను సచిన్ ప్రతిసారీ గుర్తు చేసుకుంటాడు.

అన్న అజిత్ తన జీవితం నుంచి విడదీయరాని మనిషని సచిన్ తాజాగా మరోసారి చెప్పాడు. తన గురువు ఆచ్రేకర్ వద్దకు తీసుకెళ్లడం దగ్గర్నుంచి, తన ఆటలో మెరుగుపర్చుకోవాల్సిన అంశాల వరకు అన్ని విషయాల్లోనూ అన్న ప్రధాన పాత్ర పోషించాడన్నాడు.
తనకు ఏ సందేహం వచ్చినా దానికి సమాధానం చెప్పేది తన అన్న అజిత్ మాత్రమేనన్నాడు. తన కంటే తన అన్ననే ముందు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడనుకున్నానని, అది కుదరలేదన్నాడు. తన కెరీర్లో ప్రపంచ కప్ చేతుల్లో పట్టుకుని చూడాలని కలలు కన్నానని, దానిని సగర్వంగా ఎత్తుకోవడమే తన లక్ష్యంగా మారిందన్నాడు. 2011 ప్రపంచ కప్‌తో ఆ కోరిక తీరిందన్నాడు.