హైదరాబాద్: హైదరాబాద్ మాజీ కెప్టెన్, మాజీ క్రికెటర్ ఎమ్‌వి శ్రీధర్ సోమవారం కన్నుమూశారు. నగరంలోని బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌లో గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన వయసు 51 ఏళ్లు. ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని సొంతింటికి తరలించారు.
నాలుగేళ్లు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్‌గా ఉన్న శ్రీధర్ సెప్టెంబర్ నెలలో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తాను ఆడిన రోజుల్లో హైదరాబాద్ జట్టుకు ఓ పిల్లర్ మాదిరి ఉండేవారు. 1988-1999 మధ్యకాలంలో శ్రీధర్ 97 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడి 6,701 పరుగులు చేశారు.

అందులో 21 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజి 48.91గా ఉంది. ఎమ్‌వి శ్రీధర్ అత్యధిక స్కోరు 366. 1993-94 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర జట్టుపై 944 బంతుల్లో ఈ స్కోరు నమోదు చేశారు. రంజీ ట్రోఫీ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా శ్రీధర్ ఉన్నారు.
బీబీ నింబాల్కర్ 443 పరుగులతో అగ్రస్ధానంలో కొనసాగుతుండగా, సంజయ్ మంజ్రేకర్ 377 పరుగులతో రెండో స్ధానంలో ఉన్నారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. వెంకటపతిరాజు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత 2010-11 రంజీ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు తాత్కాలిక కోచ్‌గా కూడా పనిచేశారు.
అనంతరం బీసీసీఐ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో బీసీసీఐ అతిథ్యమిచ్చిన వరల్డ్ టీ20 టోర్నమెంట్ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. శ్రీధర్ మృతిపట్ల హైదరాబాద్, బీసీసీఐ క్రికెట్ పెద్దలు సంతాపం ప్రకటించారు.
టీమిండియా 2007-08లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు మేనేజర్‌గా కూడా వ్యవహరించారు. ఎమ్‌వి శ్రీధర్ మృతిపై స్పందించిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 'చాలా నిబద్ధతతో పనిచేసే వ్యక్తి ఎంవీ శ్రీధర్ అని, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరం' అని అన్నారు. గతంలో తాను, శ్రీధర్ హైదరాబాద్ జట్టులో ఆడామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.