హైదరాబాద్: పూణె వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 27వ సెంచరీని నమోదు చేశాడు. తొలి వన్డేలో అద్భుతమైన షాట్లతో కోహ్లీ తన మాస్టర్ క్లాస్‌ని మరోసారి చూపించాడు.
మూడు ఫార్మెట్లలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత కోహ్లీ ఆడిన తొలి వన్డేలోనే జట్టుకు చక్కటి శుభారంభాన్నిచ్చాడు. 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సహచర క్రికెటర్లు విఫలమైన చోట కోహ్లీ, కేదార్ జాదవ్‌లు అద్భుతమైన సెంచరీలతో విజృంభించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.
అంతేకాదు ఇంగ్లాండ్‌తో జరిగిన తొల వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, తన కెరీర్‌లో 27వ సెంచరీ సాధించాడు. మరో సెంచరీ హీరో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేదార్ జాదవ్‌తో కలిసి అతను ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

28 ఏళ్ల కోహ్లీ 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో రాణించడంతో తొలి వన్డేలో టీమిండియా మూడు వికెట్లతో ఇంగ్లాండ్‌తో ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మరో సెంచరీ వీరుడు కేదార్ జాదవ్‌తో కలిసి అతను ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
ముఖ్యంగా క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన సిక్సు స్టాండ్స్‌లోకి వెళ్లడంతో కామేంటేటర్లు, అభిమానులు, ఇంగ్లాండ్ ప్లేయర్లు సైతం అవాక్కయ్యారు. ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ వేసిన 34వ ఓవర్ తొలి బంతినే కోహ్లీ సిక్సుగా బాదాడు. ఈ సిక్సుని కోహ్లీ కేవలం నించొని కొట్టడం విశేషం.
కోహ్లీ కొట్టిన షాట్ స్టాండ్స్ దాటి అభిమానుల మధ్యలో పడటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోహ్లీ బాదిన ఈ సిక్సుకి సంబంధించిన వీడియోని బీసీసీఐ తన వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయడంతో ఈ వీడియోకి 4.2 లక్షల మంది వీక్షించారు. తొలి వన్డేలో కామెంటేటర్లుగా వ్యవహరించిన నాజర్ హుస్సేన్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, ఎల్ శివరామకృష్ణన్ తదితరులు కోహ్లీ సిక్సుపై ప్రశంసలు కురిపించారు.