
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోని తన సహచర ఆటగాడు మురళీ విజయ్‌తో కలిసి ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో డాబ్ డ్యాన్స్ చేశాడు. ఈ మధ్య కాలంలో టెస్టు, వన్డే, టీ20 ఏ ఫార్మాట్‌లో అయినా సరే ఆటగాళ్లు హాఫ్ సెంచరీ, సెంచరీ సాధించినప్పుడు తమ ఆనందాన్ని ఒక్కోలా వ్యక్తం చేస్తుండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా శ్రీలంకతో జరుగుతోన్న మూడో టెస్టు, తొలి ఇన్నింగ్స్ 56వ ఓవర్లో మురళీ విజయ్ సెంచరీ పూర్తి చేశాడు. 164 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో మురళీ విజయ్ సెంచరీని సాధించాడు. టెస్టుల్లో మురళీకి ఇది 11వ సెంచరీ కాగా ఈ సిరిస్‌లో వరుసగా రెండోది కావడం విశేషం.
దీంతో సెంచరీ అనంతరం మురళీ విజయ్ తన బ్యాట్, హెల్మెట్ పక్కన పడేసి కోహ్లీతో కలిసి డ్యాన్స్ చేశాడు. డాబ్ డ్యాన్స్ చేద్దామని విజయ్ అడగగానే కోహ్లీ ఓకే అన్నాడు. ఇద్దరూ కలిసి మైదానంలో డాబ్ డ్యాన్స్ చేసి అభిమానుల్ని అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.
మరోవైపు తొలిరోజు టీ విరామం అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 110 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో కోహ్లీ ఈ సెంచరీని నమోదు చేశాడు. టీ విరామం అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్ 62వ ఓవర్‌లో సింగిల్ తీసి సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 20వ సెంచరీ కాగా, ఈ సీజన్‌లో వరుసగా మూడోది కావడం విశేషం. మరోవైపు తన సొంతమైదానమైన ఫిరోజ్ షా కోట్లాలో కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.