
ముంబై: ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ గాయంపై అప్పుడే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ట్విట్టరెట్టీలు విజయ్ శంకర్ గాయం గురించి తమలో తలెత్తిన అనుమానాలను పంచుకుంటున్నారు. గాయం పేరుతో విజయ్ శంకర్‌ను అర్ధాంతరంగా, ఉద్దేశపూరకంగా జట్టు నుంచి తప్పించారనే ఆరోపణలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. తమకు వచ్చిన సందేహాలను నివృత్తి చేయాలని కోరుతూ ట్విట్టరెట్టీలు తమ ట్వీట్లను నేరుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు ట్యాగ్ చేస్తున్నారు.
గాయపడ్డ క్రికెటర్‌తో పనులు చేయించుకుంటారా?
ఇలాంటి అనుమానాలను లేవనెత్తిన వారు టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్ బౌలర్ మురళీ కార్తిక్ కూడా ఉన్నారు. మడమ గాయంతో అడుగు తీసి, అడుగు వేయలేని స్థితిలో ఉన్నాడనే కారణంతోనే విజయ్ శంకర్‌ను జట్టు నుంచి తప్పించారని, ఆ స్థితిలో ఉన్న ఆటగాడి ద్వారా డ్రింక్స్‌ను ఎలా తెప్పించుకున్నారని ప్రశ్నించాడు మురళీ కార్తిక్. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం ఓ ట్వీట్ చేశారు. విజయ్ శంకర్‌ను తప్పించారనే వార్త అందిన వెంటనే ఆయన తన అనుమానాలు ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు. గాయపడ్డ ఓ ఆటగాడితో డ్రింక్స్ తెప్పించుకుంటారా? ఆ పనిచేయడానికి మరెవరూ దొరకలేదా? అంటూ మురళీ కార్తిక్ ట్వీట్ చేశారు.
గాయం నిజమేనా?
విజయ్ శంకర్‌ను తప్పించడం వెనుక సహేతుక కారణం దొరకలేదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రెండు మ్యాచ్‌లను ఆడిన తరువాత అతని గాయం తిరగబెట్టిందని టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోందని, అలాంటప్పుడు అతనికి విశ్రాంతిని ఇవ్వకుండా ఎలా ఆడించారని ప్రశ్నిస్తున్నారు. శిఖర్ ధావన్ గాయపడ్డ సమయంలో గానీ, భువనేశ్వర్ కాలి కండరాలు పట్టేసినప్పుడు గానీ.. వారిద్దరి పరిస్థితిని టీమిండియా మేనేజ్‌మెంట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వచ్చిందని, విజయ్ శంకర్ విషయంలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. గాయం పేరుతో అతణ్ని జట్టు నుంచి తప్పించారా? అని నిలదీస్తున్నారు అభిమానులు.