ముంబై: మహారాష్ట్రలోని దాయాదుల మధ్య పోరులో సిటీ పుణెతో పోలిస్తే ముంబై సిటీ పటిష్ఠంగా ఉంది. సెమీస్ దిశగా దూసుకెళుతున్న ముంబై సిటీ ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో టాప్ 4 జాబితాలో ప్లేస్ సంపాదించుకున్నది. పుణెతో జరిగే మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా తన స్థానాన్ని మరింత సంఘటిత పర్చుకోవాలని తలపోస్తోంది. అట్లెటికో డీ కోల్ కతా, నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్లపై విజయం, డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ తో జరిగిన మ్యాచ్ ను ముంబై సిటీ డ్రాగా ముగించింది. తద్వారా ఒక లక్ష్య సాధన దిశగా సీరియస్‌గా అడుగులేస్తూ ముందుకు సాగుతోంది.
బెంగళూరు ఎఫ్ సి ప్లేయర్లు ప్రత్యేకించి సునీల్ ఛెత్రి రాక ముంబై సిటీ జట్టుకు బూస్ట్ కానుంది. పుణె సిటీ సైతం ఇంతకుముందు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 2 - 1 స్కోర్ తేడాతో స్వల్పంగా మెరుగు పడింది. అయితే పుణె సిటీతో పోలిస్తే ముంబై సిటీకే సెమీస్ బెర్త్ అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ముంబైలో జరిగే మ్యాచ్‌లో విజయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2014లో పుణె సిటీలో ముంబై ఒక మ్యాచ్ లో 5 - 0 స్కోర్ తేడాతో, రెండో మ్యాచ్‌లో పుణె సిటీ 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించాయి. గతే ఏడాది ఒక మ్యాచ్ ముంబై సిటీ 3- 1 స్కోర్ తేడాతో గెలుపొందితే.. మరో మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రాగా ముగిసింది. ఈ ఏడాది టోర్నీ ప్రారంభంలో జరిగిన మ్యాచ్‌లో పుణెపై 1 - 0 స్కోర్ తేడాతో ముంబై సిటీ గెలిచింది. అర్జెంటీనా కుర్రాడు మాటియాస్ డెఫెడెరికో చేసిన ఏకైక గోల్‌తో ముంబై పైచేయి సాధించింది.

ముంబై సిటీ డిఫెన్స్‌లో రాతి గోడలో ప్రత్యర్థి జట్టుకు అవరోధం లుసియాన్ గైయాన్. 33 ఏళ్ల ఈ కుర్రాడు విపత్కర సమస్యల నుంచి జట్టును తేలిగ్గా బయటపడేయగల సామర్థ్యం ఆయన సొంతం. ఏరియల్ స్కిల్స్ ద్వారా జోక్యంచేసుకుని పదేపదే ఇతరుల అటాకింగ్ మ్యాచ్‌ను విజయవంతంగా ఎదుర్కోవడంలో దిట్ట. ఇక పుణె సిటీలో సిల్కీ పాసింగ్ మ్యాన్ అనిబల్ రోడ్రిగ్జ్. ఈ స్పానిష్ ప్లేయర్ ఒక్కోసారి గేమ్ రూపురేఖలే మార్చేయగల సమర్థుడంటే అతిశేయోక్తి కాదు. ఆయన ఎరియల్ ఎబిలిటీస్‌ను ఎదుర్కోవడమంటే ప్రత్యర్థి జట్టుకు హడలే. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కోల్ కతాపై పుణె విజయంలో రోడ్రిగ్జ్ పాత్ర చాలా కీలకం. ఈ పాజిటివ్ అంశాలు తప్పనిసరిగా ప్రత్యర్థిని కలవరపరుస్తాయి.
మిడ్ ఫీల్డ్‌లో క్రిస్జిషియాన్.. అసిస్టెన్స్‌లో లింగ్డో
ప్రస్తుత సీజన్‌లో ముంబై సిటీ జట్టులో స్టార్ పెర్పార్మర్ క్రిస్జిషియన్ వాడోక్జ్. ముంబై జట్టు గెలుపుకోసం ప్రతి నిమిషం ఆరాటపడతాడంటే అతిశేయోక్తి కాదు. మిడ్ ఫీల్డ్ స్టిక్‌గా నిలబడి మంచి మంచి బంతులను పాస్ చేయగల నేర్పు ఓర్పు గల ప్లేయరితడు. ప్రత్యర్థి జట్ల బలహీనతలను సొమ్ముచేసుకుని ఒకే మ్యాచ్ లో రెండు గోల్స్ చేసిన ప్లేయర్ క్రిస్జిషియాన్ ఒక్కడే. ఎఎఫ్ సి ఫైనల్స్‌లో బెంగళూరు ఎఫ్ సి తరపున ప్రాతినిధ్యం వహించిన ఈగెనెసోన్ లింగ్డో రాక పుణెకు కలిసి వచ్చే అంశం అనడంలో సందేహం లేదు. గతేడాది జట్టుకు గోల్స్ చేయడంలోనూ, ఇతర సహచర ప్లేయర్లకు అవసరమైనప్పుడు అసిస్టెన్స్ ఇవ్వడానికి మొగ్గుచూపుతాడు. లింగ్డో ఎల్లవేళలా బంతి వెన్నంటి ఉంటూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించగలడు.
ఇంద్రజాలికుడు సునీల్ ఛెత్రి
ఇంద్రజాలికుడిగా పేరొందిన సునీల్ ఛెత్రి రాక ముంబై సిటీ ఎఫ్ సి జట్టుకు తిరుగులేని ఫేవరెట్ అంశం. ఎఎఫ్ సి కప్ టోర్నీలో జట్టును ఫైనల్స్ వరకూ తీసుకెళ్లిన ఛెత్రి కమిట్మెంట్లు పూర్తయ్యాయి. గతేడాది అత్యధికంగా 7 గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది కూడా చేయగల సామర్థ్యం ఆయన సొంతమంటే అతిశేయోక్తి ఎంతమాత్రం కాదు. పుణె సిటీలో కోచ్ అంటోనియా హబాస్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా వ్యవహరిస్తూ బ్యాక్ నుంచి వాస్తవిక ద్రుక్పథంతో వ్యవహరిస్తూ చెలరేగిపోయే ప్లేయర్ ఎడుయార్డో ఫెరీరా. స్కోరింగ్ పాయింట్లకు, ఓటమికి మధ్య తేడాను తరుచుగా చెరిపేయగల సామర్థ్యం ఫెరీరాకే సొంతం. ముంబైపై పుణె విజయంలో ఫెరీరా పాత్ర ఉన్నదంటే అతిశేయోక్తి కాదు.
జట్ల వివరాలు:
ముంబై సిటీ ఎఫ్‌సి: రాబర్టో వొల్పాటో నెటో, అమరీందర్ సింగ్, అల్బినో గోమ్స్, గెర్సన్ వైరీరా, లుసియాన్ గౌవాన్, ఫకుండో కార్డోజో, అన్వర్ అలీ, ఐబోర్లాంగ్ ఖోంగ్జీ, లాల్హ్ మంగైహ్సాంగ రాల్టే, లాల్ఛున్మావియా ఫనాయి, అశుతోష్ మెహతా, క్రిస్జిషియాన్ వాడోక్జ్, లియో కోస్తా, జాకీచంద్ సింగ్, శరణ్ సింగ్, సెహ్నాజ్ సింగ్, భైంథాంగ్ హావోకిప్, డేవిడ్ లాల్రిన్మౌనా, మాటియాస్ డెఫెడెరికో, ఒటాలికో బ్రిటో అల్వెస్, సోనీ నోర్డే, డియాగో ఫోర్లాన్, థియాగో చున్హా, సునీల్ ఛెత్రి, ఉదాంతా సింగ్.
ఎఫ్ సి పుణె సిటీ: ఎడెల్ బెటె, అరిండం భట్టాచార్య, విశాల్ కైథ్, జోడింగ్లియాన రాల్టే, విశాల్ కైథ్, రాహుల్ భెకె, యుమ్నం రాజు, నారాయణదాస్, అగస్టిన్ ఫెర్నాండెజ్, ధర్మరాజ్ రావణన్, ఎడుయారో పెరీరా, గౌరమంగి సింగ్, అరాట ఇజుమి, జొన్నాథన్ లుక్కా, ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్, బ్రూనో ేరియాస్, జోసెఫ్ మారియా, కోమాడేవల్ క్రౌజ్ (పిటు), లెన్నీ రోడ్రిగ్జ్స్, మోమర్డోయె, సంజూ ప్రధాన్, అనిబల్ జుర్డో రొడ్రిగ్స్, గుస్తావో ఒబెర్మన్, జీసస్ రోడ్రిగ్జ్ టాటూ, ఎగెన్సన్ లింగ్డో.