IPL 2025 Mumbai Indians: ఐపీఎల్ 2025 ప్రారంభంలో తడబడి.. ఆ తర్వాత పుంజుకుని ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. అదేంటంటే ఈ సీజన్ తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మలప్పురం మణికట్టు మాంత్రికుడు విఘ్నేశ్ పుత్తూర్.. మిగతా మ్యాచులకు దూరం కానున్నాడు. గాయం వల్ల అతడికి విశ్రాంతి ఇచ్చి మరో ప్లేయర్ ను జట్టులోకి తీసుకోబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది ఎంఐ జట్టు.
విఘ్నేశ్ పుత్తూర్ స్థానంలో 31 ఏళ్ల రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ రఘు శర్మను తీసుకున్నట్లు తెలిపింది ముంబై యాజమాన్యం. ఆర్ఏపీపీ లిస్ట్ నుంచి అతడిని రూ.30 లక్షల బేస్ ప్రైస్ కు దక్కించుకుంది. జలాంధర్ కు చెందిన ఈ బౌలర్.. ఇప్పుడే తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్నాడు. దేశవాళీ క్రికెట్ లో అతడికి మంచి రికార్డు ఉంది. పంజాబ్, పుదుచ్చేరి తరఫున డొమాస్టిక్ క్రికెట్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 11 మ్యాచుల్లో 19.59 సగటుతో 57 వికెట్లు తీశాడు. అతడి బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 7/56. అలానే లిస్ట్ ఏ క్రికెట్ లో 9 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అలానే టీ20లో మూడు వికెట్లు కూడా తీశాడు.
పుత్తూర్ బాధ్యత ముంబైదే..
ఇక విఘ్నేశ్ పుత్తూర్ విషయానికొస్తే.. తన తొలి సీజన్ లో తనదైన ముద్రవేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచుతో ఆరంగేట్రం చేసిన అతడు.. తొలి మ్యాచులోనే మూడు వికెట్ల ప్రదర్శన తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. స్టార్ బ్యాటర్ ధోనీ కూడా విఘ్నేశ్ ప్రదర్శనకు మెచ్చి, ప్రత్యేకంగా అతడితో ముచ్చటించి అభినందించాడు. ఆ తర్వాత విఘ్నేశ్ ఐదు మ్యాచులు ఆడి ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. కానీ అనూహ్యంగా గాయపడ్డాడు.
అయినప్పటికీ విఘ్నేశ్ జట్టుతోనే ఉండనున్నాడు. అతడికి ముంబై జట్టుకు చెందిన మెడికల్ బృందం చికిత్స అందిస్తోంది. వాళ్ల పర్యవేక్షనలో ఉంటూ అతడు చికిత్స తీసుకోనున్నాడు. ఇదే విషయాన్ని ముంబై ఫ్రాంఛైజీ తెలుపుతూ.. అతడు త్వరలోనే కోలుకోవాలని కోరుకుంది.
