ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై అధికారికంగా ఎలిమినేట్ అయ్యింది. 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలే సాధించి ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా తదుపరి దశకు చేరుకోవడానికి ఆ జట్టుకు అవకాశం లేకపోవడంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై నిష్క్రమించింది.
అయితే ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అయిన వేళ.. ఆ జట్టు గురించి జాతీయ మీడియాలో సంచలన కథనాలు వస్తున్నాయి. ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయని, ముంబై ఇండియన్స్ ముక్కలైందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జాతీయ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం..

రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను నియమిస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయం బ్యాక్ ఫైర్ అయ్యింది. సీజన్ ఆరంభం నుంచే ఆటగాళ్లు అసంతృప్తితో బరిలోకి దిగారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ చేసిన వ్యాఖ్యలు బహిరంగ గొడవలకు ఆజ్యం పోశాయి. ఓటమికి తిలక్ వర్మను బాధ్యుడిని చేస్తూ నయా కెప్టెన్ పేర్కొనడం ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రకంపనలు సృష్టించాయి.
అయితే ఆ మ్యాచ్‌లో గొప్పగా పోరాడింది తెలుగు కుర్రాడు తిలక్ వర్మనే. 32 బంతుల్లో తిలక్ 63 పరుగులు చేశాడు. కానీ అంతిమంగా ముంబై విజయం సాధించలేకపోయింది. ఓటమి గురించి హార్దిక్ మాట్లాడుతూ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తిలక్ దూకుడుగా ఆడాల్సిందనే, అదే తమ జట్టు కొంపముంచిదని విమర్శించాడు. దీనిపై జట్టులో చర్చలు జోరుగా సాగాయి.
తిలక్ వర్మకు మద్దతుగా రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు అండగా నిలిచారు. అనంతరం ఈ ముగ్గురు స్టార్లు విరామ సమయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకున్నారు. హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, టీమే మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్‌తో వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు విమర్శలపై తిలక్ వర్మ స్పందించిన సమయంలో హార్దిక్‌తో వాగ్వాదం కూడా చోటు చేసుకుందని ప్రచారం సాగుతోంది.