
ముంబై: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ జరగనున్న విషయం తెలిసిందే. పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు, సిబ్బందికి ఐదుసార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. దుబయ్‌లో జరిగే ఐపీఎల్ 2020 కోసం ఒక్కరొక్కరుగా ముంబైకి చేరుకుంటున్నారు. కొందరు దేశవాళీ క్రికెటర్లు ఇప్పటికే ముంబైకి రాగా.. కొద్దిరోజుల్లో మరికొందరు జట్టుతో కలువనున్నారు. టీమిండియా సభ్యులు సైతం 7-8 రోజుల్లో ముంబైకి వెళ్లనున్నారు.
జట్టు సభ్యులు ఒక్కరొక్కరుగా ముంబైకి రావడం ప్రారంభించారని, ఏ క్రీడాకారుడు కూడా వైరస్ బారిన పడకుండా కఠినమైన నియమావళిని పాటిస్తున్నామని ముంబై ఇండియన్స్ జట్టు అధికారి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'దేశవాళీ క్రికెట్లరు ముంబైకి రావడం ప్రారంభించారు. వారందరిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నాం. ఒక్కరికి సెపరేట్ గదులు ఉంటాయి. క్వారంటైన్‌లో ఉన్నవారందరికి అన్నిరకాల సదుపాయాలు కల్పించనున్నాం' అని చెప్పారు.
'భారత జట్టులోని ఆటగాళ్లు సైతం త్వరలోనే ముంబై రానున్నారు. వారిని సైతం క్వారంటైన్‌లో ఉంచనున్నాం. క్వారంటైన్ సమయం ముగిసిన తర్వాత వారికి శిక్షణ మొదలవుతుంది' అని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే దుబాయ్ విమానం ఎక్కేలోపు ఒక్కో ఆటగాడికి ఐదుసార్లు వైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 'ముంబైకి వచ్చేముందే ప్రస్తుతం ఆటగాళ్లు ఉన్న నగరంలోనే రెండు సార్లు పరీక్షలకు హాజరుకావాల్సిందిగా వారిని కోరాం. ఇక్కడికి వచ్చాక మరో మూడు సార్లు టెస్టులు నిర్వహిస్తాం. సహాయక సిబ్బందిని సైతం ఇదే తరహాలో పరీక్షించనున్నాం' అని ఆ అధికారి చెప్పుకొచ్చారు.
మరోవైపు యూఏఈకి బయల్దేరే ముందు 8 జట్ల యాజమాన్యం, ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని వారం రోజులు క్వారంటైన్‌లో ఉంచి రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ నెగటివ్ వచ్చిన వారు మాత్రమే యూఏఈకి బయల్దేరి వెళ్లనున్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే.. అతణ్ని 14 రోజులు క్వారంటైన్‌కు పంపిస్తారు. ఆ తర్వాత అతడు 24 గంటల వ్యవధిలో మరో రెండు కొవిడ్-19 ఆర్‌టీ-పీసీర్ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్ వస్తే.. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లడానికి అనుమతిస్తారు. ఐపీఎల్ కోసం యూఏఈకి వచ్చే విదేశీ ఆటగాళ్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
యూఏఈకి వెళ్లిన వెంటనే అక్కడ ఒకసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆపై 14 రోజులు క్వారంటైన్‌లో క్రికెటర్లని ఉంచనున్నారు. తొలి వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పరీక్షలు చేయించుకొని అన్నీ నెగెటివ్‌గా తేలాలి. అప్పుడే బయో బబుల్‌లోకి చేర్చి ప్రాక్టీస్‌కు అవకాశం ఇస్తారు. ఈ వారం సమయంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఒకరితో మరొకరు కలవకూడదు. ఇలా మొత్తంగా ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందే ప్రతి క్రికెటర్‌కీ ఐదు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఐపీఎల్ జరిగే సమయంలో ప్రతీ 5వ రోజు క్రికెటర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు.