
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా పడింది. ఐపీఎల్ సీజన్-12లో రోహిత్ శర్మకు జరిమానా పడడం ఇది రెండోసారి. మొదటగా కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్‌కు జరిమానా (రూ.12లక్షలు) పడింది. తాజాగా ఎల్బీడబ్ల్యూగా అవుటయిన సందర్భంగా అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి జరిమానాకు గురయ్యాడు.
ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 232 పరుగులు చేసింది. 233 పరుగుల భారీ లక్ష్యంతో ముంబయి ఛేదనకు దిగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ మూడు ఫోర్లు బాది ఊపుమీదున్నాడు. నాలుగో ఓవర్‌ను కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ గర్నీ వేస్తున్నాడు. ఆ ఓవర్‌లో మూడో బంతి రోహిత్ ప్యాడ్లను తాకగా.. అంపైర్ నితిన్ మీనన్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. వెంటనే రోహిత్‌శర్మ రివ్యూ కోరాడు.
బంతి పిచింగ్ ఔట్ సైడ్‌లో పడటంతో పాటు లెగ్ వికెట్‌ను కొద్దిగా తాకుతూ వెళ్లినట్లు రివ్యూలో తేలింది. థర్డ్ అంపైర్.. అంపైర్స్ కాల్‌కు అవకాశం ఇచ్చాడు. దీంతో నితిన్ మీనన్ రోహిత్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఈ ఘటనతో రోహిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అనంతరం అంపైర్ దగ్గరికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేసి.. అక్కడున్న వికెట్లను తన బ్యాటుతో కొట్టాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి 2.2 లెవెల్ 1ను ఉల్లగించిన కారణంగా రోహిత్‌కు మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు.