రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు గడువు మరో 8 రోజులు మాత్రమే. అక్టోబర్ 31వ తేదీలోపు రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది.
నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. రిటెన్షన్ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది.

అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ తమ రిటైన్ లిస్ట్‌ను దాదాపుగా ఖరారు చేసింది. ప్రస్తుతానికి నలుగురు ఆటగాళ్లను మాత్రమే నేరుగా రిటైన్ చేసుకోవాలని భావిస్తుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యతో పాటు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లను అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకుంది. మిగిలిన ఆటగాళ్లను వేలంలో ఆర్‌టీఎమ్ ద్వారా తీసుకోవాలని యోచిస్తోంది.
అయితే ముంబై ఫ్రాంచైజీ గురించి ఓ వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను వేలంలోకి రమ్మని ముంబై ఇండియన్స్ అనధికారికంగా ప్రేరేపిస్తున్నట్లు రాసుకొచ్చింది. గత సీజన్‌లో రషీద్ అంచనాలను అందుకోలేకపోయాడు. 12 మ్యాచ్‌ల్లో 102 పరుగులే సాధించిన అతను 10 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే పొదుపుగా బౌలింగ్‌తో పాటు సిక్సర్లు బాదే సామర్థ్యం ఉండటంతో అఫ్గాన్ ఆల్‌రౌండర్ రషీద్‌ను తమ ఫ్రాంచైజీలోకి తీసుకురావాలని ముంబై భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, గతంలో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్‌తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.