ఐపీఎల్-2024లో ప్రీ క్లైమాక్స్ మొదలైంది. టీమ్స్ మధ్య ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. పది మ్యాచ్‌ల్లో ఎనిమిదింట్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో టేబుల్ టాప్‌లో దర్జాగా కూర్చొంది. తదుపరి దశకు ఆర్ఆర్ చేరుకోవడం ఖరారైంది. కానీ మిగిలిన జట్లు కూడా రాజస్థాన్‌తో సమంగా పాయింట్ల సాధించే అవకాశం ఉండటంతో ఆర్‌ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరినట్లు అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాల్ని చవిచూడకుంటే కేకేఆర్ కూడా ప్లేఆఫ్స్‌కు వెళ్లడం ఖాయమే. ఇక మిగిలిన రెండు స్థానాల్లో ఏ జట్టు అర్హత సాధిస్తుందనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. అయితే నిన్న వాంఖడే వేదికగా కేకేఆర్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కథ ముగిసిందని భావిస్తున్నారంతా.

కానీ సాంకేతికంగా ముంబై ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. లీగ్‌లో నాకౌట్ స్టేజ్‌కు చేరుకోవడానికి హార్దిక్‌సేనకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం మూడింట్లో గెలిచి ఆరు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో నిలుస్తుంది. అయితే ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఈ స్థితిలో ముంబై టాప్-4లో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోవాలి. లక్నో తర్వాతి మ్యాచ్‌ల్లో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అంతేగాక హార్దిక్ సేన మిగిలిన జట్ల ఫలితాలపై ఓ కన్నేయాలి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లు 12 పాయింట్లు దాటకూడదని కోరుకోవాలి.
ఇవన్నీ అనుకున్నట్లుగా జరిగినా ముంబైకు ఆఖర్లో నెట్‌రన్‌రేట్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముంబై నెగటివ్ రన్‌రేటులో (-0.356)లో ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటే ముంబై ఫ్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.