ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆరో టైటిల్ వేటను ప్రారంభించబోతోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు ఈ సారి వేలంలో బలమైన ఆటగాళ్లను సొంతం చేసుకున్నప్పటికీ.. తుది జట్టు ఎంపికలో కెప్టెన్‌కు కష్టాలు తప్పేలా లేవు. ముఖ్యంగా ఈ ఐదుగురు ప్లేయర్లు ఈ సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ గత 5 సీజన్లుగా కప్పు గెలవకపోవడం గమనార్హం. ఈ సారి ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉన్న హార్దిక్ పాండ్యా.. జట్టు సమతుల్యత కోసం కొందరు స్టార్ ప్లేయర్లను కూడా పక్కన పెట్టక తప్పదు.
1. శార్దూల్ ఠాకూర్
ముంబై ఇండియన్స్ వద్ద ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి ప్రపంచ స్థాయి పేసర్లు ఉన్నారు. దీనికి తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్వయంగా నాలుగో పేసర్‌గా బాధ్యతలు చేపడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో లార్డ్ శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు దక్కడం చాలా కష్టం. ప్రధాన బౌలర్లలో ఎవరైనా గాయపడితే తప్ప శార్దూల్‌కు అవకాశం రాకపోవచ్చు.

2. రాబిన్ మింజ్
జార్ఖండ్‌కు చెందిన ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్‌ను ముంబై భవిష్యత్తు స్టార్‌గా భావిస్తోంది. అయితే జట్టులో క్వింటన్ డి కాక్ వంటి సీనియర్ కీపర్ ఉండటం.. అలాగే ర్యాన్ రికెల్టన్ వంటి అనుభవజ్ఞులైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటంతో రాబిన్ మింజ్ ఈ సీజన్‌లో బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
3. కార్బిన్ బాష్
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్‌ను ముంబై బ్యాకప్ ప్లేయర్‌గా తీసుకుంది. విదేశీ కోటా పరిమితంగా ఉండటం వల్ల విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వంటి హేమాహేమీలను దాటుకుని కార్బిన్ బాష్ తుది జట్టులోకి రావడం అసాధ్యమనే చెప్పాలి.
4. రాజ్ అంగద్ బావా
అండర్-19 వరల్డ్ కప్ స్టార్ ఆల్‌రౌండర్ రాజ్ బావా ప్రతిభావంతుడే అయినప్పటికీ.. హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ ఉన్న జట్టులో ఇతనికి చోటు దక్కడం కష్టమే. హార్దిక్‌కు బ్యాకప్‌గా మాత్రమే ఇతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
5. నమన్ ధీర్
గత సీజన్‌లో తన దూకుడుతో ఆకట్టుకున్న నమన్ ధీర్‌కు ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాలు మిడిల్ ఆర్డర్‌లో ఉండటంతో, జట్టు కూర్పు దృష్ట్యా నమన్ ధీర్‌ను పక్కన పెట్టక తప్పని పరిస్థితి హార్దిక్‌కు ఎదురవుతుంది.