
ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడిన ముంబై ఇండియన్స్ గతేడాది అత్యంత చెత్తగా ఆడింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే ఈ సీజన్ జట్టులో మార్పులకు మాత్రమే అని అభిమానులు సర్ది చెప్పుకున్నారు. అదే సమయంలో తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి యువ ఆటగాళ్లు కూడా తమ సత్తా నిరూపించుకున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముంబై ముందు పెద్ద సవాల్ నిలిచింది. అదేంటంటే.. లెజెండరీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేయడం.
ఈ ఐపీఎల్ వేలానికి కొన్ని రోజుల ముందే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పొలార్డ్.. ముంబై జట్టు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడిని కొనుగోలు చేయడం ముంబై ముందు సవాల్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబై కొనుగోలు చేసింది. అతని కోసం ఏకంగా రూ.17.5 కోట్లు ఖర్చు చేసింది. అతనితో పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేయాలనేదే ముంబై ప్లాన్.
వేలానికి ముందే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి కీలక ఆటగాళ్లను ముంబై రిటైన్ చేసుకుంది. అలాగే తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి యువ ఆటగాళ్లను కూడా అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ స్కౌటింగ్ టీమ్స్‌లో ముంబై బృందానికి ప్రత్యేక స్థానం ఉంది. కొందరు అత్యుత్తమ యువ ఆటగాళ్లు వీళ్ల కారణంగానే ప్రపంచానికి తెలిశారు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా యువ సంచలనం మార్కో జాన్సెన్ సోదరుడు డువాన్ జాన్సెన్‌ను కూడా ముంబై కొనుగోలు చేసింది.
గతేడాదితో పోలిస్తే ముంబై జట్టు ఇప్పుడు కొంత బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. రోహిత్, సూర్య, ఇషాన్ వంటి బడా ఆటగాళ్లతోపాటు తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఇటీవలి కాలంలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. వీళ్లంతా కలిసి కట్టుగా రాణిస్తే వచ్చే ఏడాది ముంబై జట్టు తమ ఆరో ట్రోఫీ నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలంటే వెయిట్ చేయక తప్పదు.
ముంబై బృందం: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణ్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టియన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జేసన్ బెహ్రెండాఫ్, ఆకాష్ మధవాల్, కామెరూన్ గ్రీన్, ఝై రిచర్డ్‌సన్, పియూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్, షామ్స్ ములాని, నేహల్ వాధేరా, రాఘవ్ గోయల్