
ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 పూర్తయిన తర్వాత ఈ ఐపీఎల్లో తన అనుభవాన్ని తెలిపాడు. ఈ ఐపీఎల్ ద్వారా కొన్ని పాజిటివ్స్ కూడా తనకు లభించాయని పేర్కొన్నాడు. ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌ను మెగా వేలంలో ముంలబై ఇండియన్స్ రూ.2.6కోట్లకు కొనుగోలు చేసింది. సామ్స్ ఈ సీజన్లో అత్యుత్తమ ఫామ్‌లో లేడు. చాలా సార్లు బౌలింగ్లో ఎక్కువ పరుగులిచ్చాడు. అయితే ముంబై ఇండియన్స్ చిరకాల ప్రత్యర్థి అయిన చెన్నై సూపర్ కింగ్స్ మీద మాత్రం అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మొత్తం మూడు వికెట్లు పడగొట్టిన సామ్స్ కేవలం 16పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఇకపోతే ముంబై ఇండియన్స్ పోస్టు చేసిన అఫీసియల్ ట్విట్టర్ హ్యాండిల్ వీడియోలో సామ్స్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో మేము అనుకున్నట్లు రాణించలేకపోయాం. కానీ వచ్చే సీజన్ కోసం మాత్రం తప్పకుండా ఫుల్ కమ్ బ్యాక్‌తో వస్తాం. మా స్క్వాడ్‌లో ఉన్న చాలా మంది ప్లేయర్లు చాలా విషయాలను నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నవాటిని వచ్చే సీజన్లో అమలు పరిచి చూపించాలి. ఇది మాకు సరైన సీజన్ కాదు.
కానీ ఈ సీజన్ మాకు అవసరమైన పాఠాలు నేర్పిన సీజన్‌గా భావిస్తున్నాను అని ఇంటర్వ్యూలో సామ్స్ అన్నాడు. 'నా విషయంలో ఆటపరమైన స్కిల్స్ మాత్రమే కాకుండా, మానసికంగా ఎలాంటి నైపుణ్యాలు కలిగి ఉండాలో కూడా నేర్చుకున్నాను. అది తప్పకుండా నా ఆటలో మరో లేయర్‌ను నిర్మించడంలో సహాయపడిందని భావిస్తున్నాను. ఈ టోర్నీలో నేను అధిగమించాల్సిన సవాళ్లు ఉన్నాయని తెలిసింది' అని సామ్స్ పేర్కొన్నాడు.
ముంబై ఇండియన్స్ వారి అత్యుత్తమ ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త సీజన్‌ను చవిచూసింది. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఈసారి మాత్రం కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించిన తొలి జట్టుగా కూడా అప్రదిష్ట మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తన తొలి గెలుపు రుచి చూసింది.