బెంగళూరు: ఐపీఎల్ 8లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో ముంబై, ఆదివారం నాటి ఐదో మ్యాచులో మాత్రం అద్భుతంగా ఆడి 18 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. రోహిత్ శర్మ 15 బంతుల్లో 46 పరుగుల(8 ఫోర్లు, రెండు సిక్స్‌లు)తో రెచ్చిపోయాడు. చివరలో ఉన్ముక్త్ చంద్ 37 బంతుల్లో 58 పరుగులు (8 ఫోర్లు, రెండు సిక్స్‌లు) అలరించాడు.
వరుసగా నాలుగు ఓటముల తర్వాత రోహిత్ శర్మ సేన గెలుపు రుచి చూడటం గమనార్హం. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై ఉత్కంఠ విజయం సాధించింది. ఆదివారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో సిమ్మన్స్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), ఉన్ముక్త్ (58) రాణించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులే చేయగలిగింది. ఏబీ డివిల్లీర్స్ (11 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 41), డేవిడ్ వైస్ (47 నాటౌట్) పోరాడినా ఓటమి తప్పలేదు. హర్భజన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. భజ్జీ కీలక సమయంలో మూడు వికెట్లు తీశాడు. భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. భారీ అంచనాలున్న క్రిస్ గేల్ (10), మన్విందర్ బిస్లా (20), కెప్టెన్ కోహ్లీ (18) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.
10 ఓవర్లలో బెంగళూరు స్కోరు 60/2. ఈ దశలో ఏబీ డివిల్లీర్ సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఏబీ విజృంభణతో ముంబై శిబిరంలో ఆందోళన నెలకొంది. చివరికి జోరుమీదున్న డివిల్లీర్స్‌ను బుమ్రా అవుట్ చేయడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది.
అంతకుముందు బెంగళూరు టాస్ గెలిచి ముంబైకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ సిమ్మన్స్ తొలి వికెట్‌కు పార్ధివ్‌తో 47, రెండో వికెట్‌కు ఉన్ముక్త్‌తో 72 పరుగులు జోడించాడు. కెప్టెన్ రోహిత్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ముంబై భారీ స్కోరు దిశగా సాగింది. ఇక 19వ ఓవర్‌లో డేవిడ్ వైస్ మూడు వికెట్లు తీసి ముంబైకి షాకిచ్చాడు. పొలార్డ్ (5), రాయుడు (0)ను అతను వరుస బంతుల్లో అవుట్ చేశాడు.