ముంబైలో ఓ స్థానిక క్రికెట్ కోచ్ 13 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈకేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ముంబైలోని ఓ మహిళా క్రికెట్ శిక్షణ కేంద్రంలో కోచ్‌గా పనిచేస్తున్న వ్యక్తి.. తన దగ్గర శిక్షణ పొందుతున్న 13 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ కోచింగ్ ఇస్తానని నమ్మించి.. ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ప్రాసిక్యూషన్ న్యాయస్థానానికి వెల్లడించింది. బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నం
ఈ కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ సంచలన విషయాలను వెల్లడించింది. నిందితుడు తాను చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు కోచింగ్ సెంటర్లోని సీసీటీవీ కెమెరాలను తారుమారు చేశాడని.. సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించాడని న్యాయస్థానానికి వివరించింది. బాధితురాలికి జరిగిన శారీరక గాయాలకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా కోర్టుకు సమర్పించారు.

బెయిల్ నిరాకరణ
మరోవైపు నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ నిర్దోషి అని.. అతడిపై తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. నిందితుడు గత 8 నెలలుగా కస్టడీలో ఉన్నాడని.. ఇంట్లో ముసలి తల్లిదండ్రులను పోషించే ఏకైక వ్యక్తి అతనేనని.. అందుకే అతడికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే సాక్ష్యాల తారుమారు అంశం ముందు ఈ వాదనలు నిలబడలేదు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేఖ సిన్హా ఈ కేసును విచారించి.. నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. నేరం చాలా తీవ్రమైనదని.. నిందుతుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి వ్యక్తులను సమాజంలోకి వదిలితే మరికొంతమంది మైనర్ బాలికల జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని న్యాయస్థానం పేర్కొంది.
మహిళల భద్రతపై ఆందోళన
ఐపీఎల్ 2026 కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం క్రీడా ప్రపంచాన్ని కలచివేస్తోంది. దేశవ్యాప్తంగా మహిళల భద్రత అనేది పెద్ద సమస్యగా మారుతోందని.. రోడ్లపైనే కాకుండా ఆఫీసులు, స్కూళ్లు, కోచింగ్ సెంటర్లలో కూడా వేధింపులు పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయమని దీని ద్వారా స్పష్టమవుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్ యాష్లీ గార్డనర్‌కు ఎదురైన చేదు అనుభవం కూడా దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చిందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.