ప్రతిష్ఠాత్మ రంజీ ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా విదర్భతో జరిగిన ఫైనల్‌లో 169 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది. రంజీ చరిత్రలో ముంబై 42వ సారి ఛాంపియన్‌గా నిలవడం విశేషం. అయితే విదర్భ అంత సులువుగా ఓటమిని అంగీకరించలేదు. అద్భుత పోరాటమే చేసింది.
538 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన విదర్భ నిలకడగా ఆడింది. కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (102; 199 బంతుల్లో), హర్ష్ దూబె (65; 128 బంతుల్లో) సాధికారికంగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. తొలి సెషన్‌లో ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ క్రమంలో హర్ష్ దూబె 85 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అక్షయ్ 195 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే శతకాన్ని అందుకున్న కాసేపటికే అక్షయ్ ఔటయ్యాడు. ఆ తర్వాత విదర్భ వికెట్ల పతనం మొదలైంది. 15 పరుగులకు చివరి అయిదు వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో తనుష్ కొటియన్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. తుషార్ దేశపాండే, ముషీర్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ (75; 69 బంతుల్లో) టాప్ స్కోరర్. పృథ్వీ షా (46; 63 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబె, యశ్ ఠాకూర్ చెరో మూడు వికెట్లు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ 105 పరుగులకే కుప్పకూలింది. యశ్ రాథోడ్ సాధించిన 27 పరుగులే అత్యధిక స్కోరు. ముంబై బౌలర్లలో ధావల్ కులకర్ణి, షామ్స్ ములాని, తనుష్ కొటియన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 119 ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై 418 పరుగులకు ఆలౌటైంది. ముషీర్ ఖాన్ (136; 326 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (95; 111 బంతుల్లో), అంజిక్య రహానె (73; 143 బంతుల్లో) రాణించారు. హర్ష్ దుబె అయిదు వికెట్లతో సత్తాచాటాడు. 538 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు కుప్పకూలింది. ముషీర్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, తనుష్ కొటియన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.