
హైదరాబాద్: క్రికెట్ చరిత్రలోనే 2017 ఓ గొప్ప సంవత్సరమని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయానికి ఆయన తన వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు.
ఈ ఏడాది భారత జట్టు టెస్టులు, వన్డేలు, టీ20లో గొప్ప ప్రతిభ కనబర్చిందని పొగడ్తలతో ముంచెత్తారు. వన్డే జట్టుకు తొలిసారి సారథ్యం వహించిన రోహిత్‌శర్మ శ్రీలంకతో జరిగిన తొలివన్డేలో రెండు పరుగులకే ఔటయ్యాడని, మళ్లీ అదే టీంతో రెండో వన్డేలో డబుల్ సెంచరీతో సత్తా చాటడం ప్రశంసనీయమన్నారు. ఈ మూడు సిరీస్‌ల్లో రాణిస్తే, వచ్చే 5 సంవత్సరాల్లో భారత్‌కు ఢోకా ఉండదన్నారు.
టెస్టు, టి-20, వన్‌డే ఫార్మాట్‌ల్లో భారత్ జట్టు నెంబర్ వన్‌గా ఉందన్నారు. అటువంటి జట్టును ఎంపిక చేయడంపై తనకు సంతోషంగా ఉందని, ఆ జట్టు నెంబర్ వన్‌గా ఉండటం కన్నా ఆనందం ఏమి ఉంటుందన్నారు. షార్ట్ ఫార్మాట్‌లో బుమ్రా రాణించడంతో ప్రమోషన్ ఇచ్చి, దక్షిణాఫ్రికా టూర్‌లో స్థానం కల్పించామన్నారు.
ఇదే పోరాట పటిమ 2018లోనూ చూపిస్తే మరో ఐదేళ్ల పాటు భారత్ క్రికెట్‌కు తిరుగుండదని అభిప్రాయపడ్డారు. 2018లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో పూర్తి సిరీస్‌లను ఆడనున్నామన్నారు. ఇంగ్లండ్ సిరీస్ తరువాత ప్రపంచ కప్ జట్టు కూర్పుపై దృష్టి సారిస్తామన్నారు. క్రికెటర్ల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా వివిధ ఫార్మాట్‌లకు ఎంపిక చేస్తామన్నారు. 2019 ప్రపంచకప్‌కు ఇంకా 18 నెలల సమయం ఉందని, సంవత్సరం ముందు నుంచి ప్రిపరేషన్ మొదలవుతుందన్నారు. టీమిండియా ప్రపంచ కప్ గెలిచితీరుందనే నమ్మకం తనకుందని అభిప్రాయపడ్డారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.