MS Dhoni: క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని క్రేజ్ మామూలుగా ఉండదు. ధోని క్రికెట్ గ్రౌండ్‌లో కనిపిస్తే చాలు అరుపులతో స్టేడియం మారుమోగాల్సిందే. అయితే 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి ఎంఎస్ ధోని తన ఐపీఎల్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై సీఎస్కే కెప్టెన్ ధోని స్వయంగా స్పందించాడు. రిటైర్మెంట్ విషయంలో తనకు కంగారు లేదని.. తనకు ఇంకా 4-5 నెలల సమయం ఉందని ధోని స్పష్టం చేశాడు. రాబోయే రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటానని ధోని పేర్కొన్నాడు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలన్నాడు. మనం ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలన్నాడు. కేవలం ప్రదర్శనకే రిటైర్మెంట్ ప్రకటిస్తే.. కొంత మంది ఆటగాళ్లు 22 ఏళ్లకే రిటైర్ కావాల్సి వస్తుందన్నాడు.
గుజరాత్ టైటాన్స్ జట్టుపై సీఎస్కే గెలిచిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మాట్లాడాడు. మేము ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేయలేకపోయామని ధోని అంగీకరించాడు. కానీ ఇది మాకు ఒక పూర్తి ప్రదర్శనలా అనిపించిందన్నాడు. ఇప్పటివరకు మేము క్యాచింగ్‌లో బాగా రాణించలేదు, కానీ ఈరోజు మాత్రం క్యాచింగ్ చాలా బాగుందన్నాడు. ఇప్పుడు రాంచీకి తిరిగి వెళ్లి కొంత సమయం బైక్ రైడ్స్‌తో ఆస్వాదించనున్నట్లు ధోని చెప్పుకొచ్చాడు. తాను ఇక ఆట ముగించేశానని చెప్పడం లేదని, తిరిగి వస్తున్నానని కూడా చెప్పడం లేదన్నాడు. తనకు ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చాడు. ఆలోచించుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటానని వివరించాడు.

సీజన్ ఆరంభంలో మా మొదటి నాలుగు మ్యాచ్‌లు చెన్నైలో జరిగాయని.. మేము బ్యాటింగ్‌ను రెండో ఇన్నింగ్స్‌కు వదిలేలా నిర్ణయించుకున్నామన్నారు. కానీ నాకు మాత్రం మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్ బాగుందనే అనిపించిందన్నాడు. మా బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ గురించి కొద్దిగా ఆందోళనగా ఉందన్నాడు. స్కోరు చేయగలగడం సాధ్యమే కానీ కొన్ని లోపాలను పూరించాల్సిన అవసరం ఉందన్నాడు. రుతురాజ్ వచ్చే సీజన్‌లో చాలా విషయాల గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నాడు.
సీఎస్కే అద్బుత విజయం
డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత సీఎస్కే బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విధంగా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన సీఎస్కే జట్టు ఐపీఎల్ 2025లో విజయంతో తన ప్రచారాన్ని ముగించింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు 14 మ్యాచ్‌ల్లో 9 గెలిచి 18 పాయింట్లు సాధించింది. 18వ సీజన్‌లో ఇది సీఎస్కే జట్టుకు ఇది నాల్గవ విజయం మాత్రమే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన తర్వాత సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విధంగా సీఎస్కే మ్యాచ్‌ను సులభంగా గెలిచింది.