టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడుస్తున్నా ట్రోఫీ వేటలో ఇప్పటికీ ముందున్నాడు. 2023 సీజన్‌లో చెన్నైను మరోసారి విజేతగా నిలిపాడు. ఇతర జట్లలో రాణించని ఆటగాళ్లు చెన్నై గూటికి చేరిన తర్వాత మ్యాచ్ విన్నర్లుగా మారిపోతుంటారు. దానికి కారణం ధోనీ ఆటగాళ్లకు మార్గనిర్దేశకం చేయడమే.
అయితే గత కొన్ని ఐపీఎల్ సీజన్ల ప్రారంభానికి ముందు ధోనీ గురించే ఓ వార్త ఎప్పుడూ చక్కర్లు కొడుతుంటుంది. ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ కథనాలు వస్తాయి.ఈ సారి కూడా అది మొదలైంది. దీనిపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించాడు. ''ఆ విషయం మాకు తెలియదు. దాని గురించి ధోనీ మాకు కూడా ఏదీ చెప్పడు. అతడే దీనికి సమాధానం ఇవ్వగలడు'' అని అన్నాడు.

42 ఏళ్ల ధోనీ ఈ ఏడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ ఫిట్‌నెస్‌పై విశ్వనాథన్ మాట్లాడాడు. ''అతడు బాగానే ఉన్నాడు. కోలుకుంటున్నాడు. జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాడు. మరో పది రోజుల్లో నెట్స్‌లో సాధన కూడా మొదలుపెడతాడు. మార్చి మొదటి వారంలో ప్రిపరేషన్ క్యాంప్ ప్రారంభిస్తాం. వచ్చే ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభమయ్యే అవకాశం ఉంది'' అని చెప్పాడు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో వారికి అదృష్టం కలిసి వచ్చిందని విశ్వనాథన్ అన్నాడు. డారిల్ మిచెల్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను వేలంలో దక్కించుకోవాలని అనుకున్నామని, మొత్తంగా సాధించామని అన్నాడు. వేలంలో చెన్నై కొనుగోలు చేసిన ప్లేయర్లు: డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ. 8.40 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు), ముస్తాఫిజుర్ (రూ.2 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ. 1.80 కోట్లు), అవనీశ్ రావు (రూ. 20 లక్షలు).