కరోనా ఎఫెక్ట్.. తోటమాలి అవతారమెత్తిన ధోనీ!!

రాంచీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అనూహ్యంగా వచ్చిన ఈ కరోనా సెలవులను కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. సెలబ్రిటీలూ దీనికి మినహాయింపేమీ కాదు. పొద్దు గడిచేందుకు వారు రకరకాల పనులతో కాలక్షేపం చేస్తున్నారు. క్రికెటర్లు హాయిగా సేదతీరడంతో పాటు ఇంటి పనుల్లోనూ ఓ చేయి వేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా అదే బాట పట్టాడు.

తోటమాలి అవతారమెత్తిన ధోనీ:
ఎంఎస్ ధోనీ కూడా తన విశాలమైన ఇంటిలో గార్డెనింగ్ పనులు చేస్తూ బిజీగా బిజీగా గడుపుతున్నాడు. గార్డెన్‌లోని గడ్డిని చదును చేసే పనిలో నిమగ్నమయ్యాడు. చుట్టూ పచ్చని చెట్లతో.. పెద్ద లాన్‌తో ఉండే తన ఇంటిని మరింత సుందరంగా తీర్చిదిద్దుకోవాలనుకున్న మహీ .. లాన్ మోవర్‌ను చేతబట్టి ఇంటి ముందు భాగంలో పెరిగిన గడ్డిని సమాంతరంగా కట్ చేశాడు. ఆ సమయంలో తీసిన ఫోటోను అతని భార్య సాక్షి ధోనీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఈ ఫొటోలో ధోనీ ఖరీదైన బైక్‌లతో కూడిన మ్యూజియంను కూడా చూడవచ్చు.

టీమిండియా స్టారైనా.. పెళ్లాం బాధలు తప్పవు:
సాక్షి ధోనీ పోస్ట్ చేసిన ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. లాక్‌డౌన్ వేళ ఇంట్లో పనులు నీకు తప్పలేదా? అని ఒకరంటే.. టీమిండియా స్టారైనా.. పెళ్లాం బాధలు తప్పవని ఇంకొకరు సరదాగా కామెంట్ చేశారు. మా ధోనీకి ఎంత కష్టమొచ్చే అని, మిస్ యూ తాల అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

ప్రపంచకప్ అనంతరం బ్యాట్ పట్టలేదు:
ఇక గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం మైదానానికి దూరమైన ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టలేదు. ఐపీఎల్‌తోనే రీ ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. కానీ..మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ వాయిదా పడటం.. ఇప్పడు జరుగుతుందో లేదోననే సందిగ్దత నెలకొనడంతో ఈ జార్ఖండ్ డైనమైట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

తండ్రికి జీవా మెరుగులు:
ధోనీ తనయ జీవా తన తండ్రికి గతంలో మేకప్ చేసింది. తన చిట్టిపొట్టి చేతులతో తండ్రికి మెరుగులు దిద్దింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను అతని మేకప్ ఆర్టిస్ట్ సప్న భవ్నానీ షేర్ చేస్తూ... 'అందరికీ ముద్దొచ్చే మేకప్ ఇది. దీంతో నా ఉద్యోగానికి త్వరలోనే ఎసరొచ్చేలా ఉంది! మహీ.. మిస్ యూ దోస్త్' అని క్యాప్షన్‌గా పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications