మరో రెండు రోజుల్లో మెగా లీగ్ ఐపీఎల్ ప్రారంభంకానుంది. రెండు నెలల పాటు సాగే ఈ మహాసమరం మార్చి 22 నుంచి షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ పోరులో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లినే.
ఆత్మీయులైన ధోనీ, కోహ్లి మైదానంలో ప్రత్యర్థుల్లా బరిలోకి దిగనున్నారు. దాదాపు ఏడాది తర్వాత ధోనీ, రెండు నెలల విరామం అనంతరం విరాట్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్ క్రేజ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎవరైనా ఈ మ్యాచ్ టిక్కెట్లు ఇప్పించండి అంటూ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో ప్రాధేయపడుతున్నాడు.

దీన్ని బట్టి అర్థమై ఉంటుంది. CSK vs RCB మ్యాచ్ గురించి ఎంతలా ఎదురుచూస్తున్నారో. ధోనీ-కోహ్లి ఫైట్‌తో పాటు ప్రారంభ వేడుకలు కూడా ఉండనుండటంతో టికెట్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. అయితే చెపాక్ చరిత్రను చూస్తే ఆర్సీబీపై సీఎస్‌కే జట్టుదే ఆధిపత్యం. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. బెంగళూరు ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్‌లన్నింట్లో సీఎస్‌కేదే గెలుపు.
ఐపీఎల్ తొలి సీజన్ 2008లో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేని ఆర్సీబీ ఓడించింది. కానీ ఆ తర్వాత వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓటమిపాలైంది. మరి, ఈ సారైనా ఈ వరుస ఓటములకు ఆర్సీబీ బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.
ఓవరాల్‌గా CSK, RCB 31 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. చెన్నై 20, బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ ఫలితం రాలేదు. ఇక చెన్నైపై ఆర్సీబీ అత్యధిక స్కోరు 218, అలాగే అత్యల్ప స్కోరు 70 పరుగులు. మరోవైపు బెంగళూరుపై సీఎస్‌కేకు అత్యధిక స్కోరు 226, అత్యల్ప స్కోరు 86 పరుగులు. గత సీజన్‌లో ఇరు జట్లు ఒక్క మ్యాచ్‌లోనే తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు విజయం సాధించింది. సీఎస్‌కేతో గత అయిదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది.