
మాంఛెస్టర్: భారత క్రికెట్ జట్టు అభిమానులు యమా ఫాస్ట్‌గా ఉన్నారు. వెస్టిండీస్‌తో మ్యాచ్ అలా ముగిసిందో, లేదో.. ఇలా కంపేరిజన్లు మొదలు పెట్టేశారు. సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
విండీస్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కార్లొస్ బ్రేత్‌వైట్ ఇచ్చిన క్యాచ్ అది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన బంతిని బ్రేత్‌వైట్ ఆడబోగా.. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా గాల్లోకి ఎగిరింది. వికెట్ల వెనకల పొంచివున్న ధోనీ..ఎడెనిమిది అడుగుల దూరం వరకు కుడి వైపు డైవ్ చేసి, మరీ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్ ఆ మ్యాచ్ మొత్తానికే హైలైట్. అది వేరే సంగతి. ఈ క్యాచ్‌ను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండంగ్ చేశారు ఫ్యాన్స్.
న్యూజీలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు కేప్టెన్ కమ్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ పట్టిన క్యాచ్‌తో దీన్ని పోల్చడం ఆరంభించారు. న్యూజీలాండ్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌ను అవుట్ చేసిన క్యాచ్ అది. రాస్ టేలర్ బ్యాట్‌ను ముద్దాడుతూ బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు దూసుకెళ్తోన్న బంతిని కుడి వైపు డైవ్ చేసి దొరకపుచ్చుకున్నాడు సర్ఫరాజ్.
ధోనీ, సర్ఫరాజ్ అహ్మద్ పట్టిన క్యాచ్‌లను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. 14 సెకెన్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ధోనీ, సర్ఫరాజ్ అహ్మద్‌లల్లో ఎవరిది బెస్ట్ క్యాచ్ అంటూ ఛాయిస్ అభిమానులకే వదిలేసింది. ఈ వీడియో తాజాగా ట్రెండింగ్ అయి కూర్చుంది. దీనిపై తమ మెమెలను జోడించి, వదులుతున్నారు డైహార్డ్ ఫ్యాన్స్.