

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు స్పెషల్ 'ఆర్మీ' క్యాప్ ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నివాళిగా ఆర్మీ క్యాప్‌లను భారత జట్టులోని ఆటగాళ్లు ధరించారు.
బీసీసీఐ లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్యాప్‌లను భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. కోహ్లీ మాట్లాడుతూ..'దేశ రక్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏం చేసినా రుణం తీర్చుకోలేం. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి. మూడో వన్డేలో మాకు రానున్న ఫీజు మొత్తాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తాం. దేశం కోసం ప్రతి ఒక్కరూ వారికి చేతనైన సేవ చేయాలని నేను కోరుతున్నా. జవాన్ల కుటుంబాలకు మనం మద్దతుగా నిలవాలి' అని అన్నాడు. ఈ నిధులను పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పిల్లల చదువు కోసం వినియోగించనున్నారు.
మరోవైపు ధోనీ సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుండగా.. వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తుండటంతో రాంచీలో అతనికిదే చివరి మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మార్పులు చేయలేదు.
గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన భారత్ జట్టు 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా.. మరోవైపు పర్యాటక జట్టు మాత్రం మూడో వన్డేలో గెలిచి సిరిస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఆశిస్తోంది.