ముంబై: తనను మ్యాచ్ ఫిక్సర్ అంటూ ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపాడు భారత వన్డే, టీ20 మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియా మేనేజర్‌గా సునీల్ దేవ్ ఉన్న సమయంలో
2014లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ వెళ్లింది.
అయితే 'టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవాల్సిందని టీమ్ సమావేశంలో నిర్ణయించగా, ధోనీ మాత్రం టాస్ గెలిచినప్పటికీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వెట్ వికెట్ అని తెలిసినా బ్యాటింగ్ ఎంచుకోవడంపై అనుమానాలు ఉన్నాయి. ఈ టెస్ట్ మ్యాచును ధోనీ ఫిక్స్ చేసివుంటాడు' అని ఓ హిందీ డెయిలీ తన కథనంలో ఆరోపించింది.
ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచులో ఇంగ్లాండ్ చేతిలో 54 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. కాగా, ఆ డెయిలీ కథనంపై ధోనీ తరపు న్యాయవాది(ఢిల్లీకి చెందిన సిఅండ్‌సి అసోసియేట్స్) తొమ్మిది పేజీల లీగల్ నోటీసు జారీ చేశారు.

'సునీల్ దేవ్ వ్యాఖ్యలను నా క్లైంట్ పరువు తీసే విధంగా ఆ వీడియోలో చూపించారు' అని నోటీసులో పేర్కొన్నారు. 'మీరు ఓ భారత క్రికెట్ అధికారి(సునీల్ దేవ్) నుంచి సమాచారం సేకరించామని చెబుతున్నారు. అయితే అతనే(సునీల్ దేవ్) మీ వాదనను కొట్టిపారేశారు' అని నోటీసులో తెలిపారు.
పబ్లిష్ చేసిన కథనం తప్పు అని 48గంటల్లోగా స్పందించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ధోనీ తరపు న్యాయవాదులు రాజ్నీష్, ప్రతీక్ మాలిక్ స్పష్టం చేశారు. 'మా క్లైంట్ (మహేంద్ర సింగ్ ధోనీ)కు జరిగిన పరువు నష్టం కింద రూ. 100కోట్లు చెల్లించాలి. ఆ కథనంతో మా క్లైంట్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అతని పరువుకు భంగం కలిగించారు' అని నోటీసులో న్యాయవాదులు పేర్కొన్నారు.