MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండడంతో సీఎస్కే క్యాంపులో కోలాహలం మొదలైంది. అందరి కళ్లు ఎప్పటిలాగే లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీపైనే ఉన్నాయి. 44 ఏళ్ల వయస్సులోనూ ఎంఎస్ ధోనీ కుర్రాడిలా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఆ వయస్సులో ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకుని కోచ్‌లుగా స్థిరపడతారు.. కానీ ఎంఎస్ ధోనీ మాత్రం ఇంకా తన బ్యాట్‌తో బంతిని బౌండరీల అవతలికి పంపుతూనే ఉన్నాడు. తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఎంఎస్ ధోనీ ప్రదర్శన చూస్తుంటే.. తలాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందని స్పష్టమవుతోంది.
నెట్స్‌లో ఎంఎస్ ధోనీ విధ్వంసం
ఈ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సీఎస్కే యువ పేసర్ ముఖేష్ చౌదరి వేసిన ఫుల్లర్ లెంగ్త్ డెలివరీని ధోనీ తనదైన శైలిలో ఆఫ్-సైడ్ దిశగా భారీ సిక్సర్‌గా మలిచాడు. బంతి బ్యాట్‌కు తగిలినప్పుడు వచ్చిన శబ్ధం ధోనీ పవర్‌కు అద్ధం పడుతోంది. 44 ఏళ్ల వయసులో కూడా ధోనీ ఖచ్చితమైన టైమింగ్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. "తలా ఈజ్ బ్యాక్" అంటూ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

బౌలర్‌పై నెటిజన్ల ఆగ్రహం
ఓ వైపు ధోనీ షాట్‌ను నెటిజన్లు మెచ్చుకుంటుంటే.. మరోవైపు బౌలర్ ముఖేష్ చౌదరిపై నెట్టింట భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. "ఎంఎస్ ధోనీ చేతిలో సిక్సర్లు తినడం ముఖేష్‌కి కొత్తేమీ కాదు" అని కొందరు ఎద్దేవా చేస్తుంటే.. మరికొందరు "ఇలాంటి బంతులు వేస్తే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు ఉతికేస్తారు, అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం మంచిది" అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ముఖేష్ చౌదరి గత సీజన్లలో రాణించినప్పటికీ.. ఎంఎస్ ధోనీ లాంటి సీనియర్ ఆటగాడి ముందు తడబడటం చర్చనీయాంశమైంది.
రిటైర్మెంట్ ఊహాగానాలు.. సంజు శాంసన్ ఎంట్రీ
గత కొన్నేళ్లుగా ధోనీకి ఇదే చివరి సీజన్ అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన "రోర్ 26" ఈవెంట్‌లో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. తన ఫిట్‌నెస్ స్థాయిలు క్రమంగా తగ్గుతున్నాయని స్వయంగా అంగీకరించాడు. మోకాలి నొప్పుల కారణంగా ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా కిందకు వస్తున్నాడు. దీనికి తోడు రాజస్థాన్ రాయల్స్ నుంచి స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్‌ను సీఎస్కే కొనుగోలు చేసుకోవడం.. ధోనీ వారసుడి వేట పూర్తయిందనే సంకేతాలను ఇస్తోంది. దీంతో ఈ 2026 సీజన్ ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐపీఎల్‌లో ధోనీ ప్రస్థానం
ధోనీ ఐపీఎల్ గణాంకాలు చూస్తే ధోనీ ఎందుకు లెజెండ్ అయ్యాడో అర్థమవుతుంది. ఇప్పటివరకు 278 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 38.30 సగటుతో 5,439 పరుగులు సాధించాడు. ఇందులో 24 అర్థ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-6 ప్లేయర్లలో ధోనీ ఒకడు. ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నప్పటికీ.. ఫినిషర్‌గా ధోనీకి ఉన్న విలువ ఇప్పటికీ తగ్గలేదు. రాబోయే సీజన్‌లో ఎంఎస్ ధోనీ తన మార్క్ హెలికాప్టర్ షాట్లతో అభిమానులను ఎలా అలరిస్తాడో చూడాలి.